Site icon vidhaatha

మామ‌, అల్లుడు…సిద్దిపేట‌కు ప‌ట్టిన చీడ‌, పీడ‌

45 ఏళ్లుగా శ‌నిలా ప‌ట్టి పీడిస్తున్న‌రు
బ్ర‌హ్మ రాక్ష‌సుల నుంచి విముక్తి చేయ‌డానికే ఈ గ‌డ్డ‌మీద‌కు వ‌చ్చా
ముదిరాజుల‌కు మంత్రి ప‌ది
కేసీఆర్‌, అమిత్‌షా లా గూడెం న‌గేశ్ కూడా ఒక దొర‌నే..
రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేసే కుట్ర‌తోనే…జ‌న‌గ‌ణ‌న చేప‌ట్ట‌ని బీజేపీ
ఆసిఫాబాద్‌, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గాల పర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి

విధాత‌: సిద్దిపేట ప్రజలను పట్టి పీడిస్తున్న బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి చేయడానికే ఈ గడ్డ మీదికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 45 ఏళ్ల నుంచి మామా, అల్లుడు శ‌నిలా ప‌ట్టి పీడిస్తున్నార‌న్నారు. సిద్దిపేట నుంచి మామ పోతా పోతా పీనుగులు తినే అల్లుడిని పెట్టి పోయాడన్నారు. పార్టీ కార్యకర్తల త్యాగాల వల్లనే మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. గురువారం ఆసిఫాబాద్‌, సిద్దిపేట‌, కుత్బుల్లాపూర్ నియోజ‌క వ‌ర్గాల‌లో సుడిగాలిపర్య‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో నిర్వ‌హించిన స‌భ‌లు, రోడ్ షోల‌లో మాట్లాడారు. ఆయ‌న సిద్దిపేట‌లో మాట్లాడుతూ 1980లో ఇందిరాగాంధీ ని గెలిపించి ప్రధానిని చేసిన చరిత్ర మెదక్ దన్నారు. ఇందిరమ్మ మెదక్ కు అనేక పరిశ్రమలు తీసుకువచ్చిందని తెలిపారు.

మంచికి మారు పేరు మెదక్ ప్రజలు.. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి  ఇక్కడి వారు ఆశ్రయం ఇచ్చారన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నుంచి బలహీన వర్గాల బిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని తెలిపారు. రైతుల భూములు గుంజుకొని మల్లన్న సాగర్ కట్టిన వారు కావాలా లేక బడుగు బలహీన వర్గాల బిడ్డ కావాలా అని సీఎం రేవంత్ ప్ర‌జ‌ల‌ను అడిగారు. రైతులపైన  అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించిన చరిత్ర వెంకట్రామిరెడ్డి దన్నారు. దొర దౌర్జన్యం ఇంకెన్ని రోజులు ఇక్కడ నడస్తద‌న్నారు. సిద్దిపేట గడ్డ పైన మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. దొరల గడిలను బద్దలు కొట్టాలంటే నీలం మధు ముదిరాజ్ గెలవాల్సిందేన‌న్నారు.

నిజాంకు కాశీం రిజ్విలాగా… కేసీఆర్ ద‌గ్గ‌ర వెంక‌ట్రామిరెడ్డి

ఎవడయ్య వెంకట్రామిరెడ్డి.. ఎక్కడి నుంచి వచ్చాడు…మల్లన్న సాగర్ జనాన్ని ముంచినోడు కాదా..? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ లో జనాన్ని కొట్టించలేదా..? భూములు గుంజుకొని ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టింది వెంకట్రామిరెడ్డి కాదా..? కలెక్టర్ గా ఉండి ప్రజల ఉసురు తీసినోడు వెంకట్రామిరెడ్డి.. అని అన్నారు. నిజాం దగ్గర కాశీం రిజ్వి లాగా కేసీఆర్ దగ్గర వెంకట్రామిరెడ్డి పనిచేశాడన్నారు. అలాంటి వెంకట్రామిరెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ రాకుండా చేయాలన్నారు.

అక్ర‌మ కేసులు పెట్టిన వారికి ఓటు ఎలా వేస్తారు..

సిద్దిపేట కు పట్టిన చీడ, పీడ మామ ,అల్లుడని అన్న సీఎం రేవంత్ రెడ్డి భూములు గుంజుకొని, రైతుల పై అక్రమ కేసులు పెట్టిన వారికి ఓటు ఎలా వేస్తారో ఆలోచించుకోవాలన్నారు. భూములు మింగిన అనకొండ కు గుణపాఠం చెప్పాలన్నారు. మొట్టమొదటి సారి గడీలు బద్దలు కొట్టే అవకాశం వచ్చిందని ఇక్కడికి వచ్చానన్నారు. సిద్దిపేట గడ్డ పైన నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని వచ్చానని తెలిపారు. సిద్దిపేట గడ్డ పౌరుషాన్ని చూశాను..నాకు నమ్మకం కల్గిందన్న రేవంత్ మెదక్ పార్లమెంట్ లో నీలం మధు లక్ష మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్య‌క్తం చేశారు. సిద్ధిపేటకు వచ్చిన ప్రతి కార్యకర్త వందమందితో సమానమ‌న్నారు.

ఈ రావులు ఇక్క‌డ అవ‌స‌ర‌మా?

చంద్రశేఖర్ రావు, హరీష్ రావు.. ఇంకో రావు కోసమేనా ఈ ప్రాంతం ఉందని రేవంత్‌ ప్ర‌శ్నించారు. పొద్దటి పూట రెండు పార్టీలు..రాత్రికి మాత్రం ఒకటే పార్టీ..ఈ రావు లు ఇక్కడ అవసరమా..? అడిగారు. ముదిరాజ్ సోదరులకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాద‌న్నారు. బీసీ డీ గ్రూప్ నుంచి ముదిరాజ్ ను ఎ  గ్రూప్ లోకి తెచ్చే బాధ్యతను నీలం మధు తీసుకుంటాడ‌న్నారు. ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టి ముళ్ల కంచెలు తొలగించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినమ‌న్నారు. అద్దంకి దయాకర్ కు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాదన్నారు. హరీష్ రావు రాసి పెట్టుకో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేసే బాధ్యత నాదే.. సిద్దిపేటకు పట్టిన శనీశ్వర్ రావు ను పాతాళానికి తొక్కే బాధ్యత నాదేన‌న్నారు. ఆగస్టు 15 నాడు సిద్దిపేట ప్రజలకు శనీశ్వర్  రావుకు విముక్తి కలుగ‌బోతుంద‌న్నారు. సిద్దిపేటకు మళ్లీ వస్తా.. కొత్త ఎమ్మెల్యే ను గెలిపిస్తాన‌న్నారు. లక్ష మందితో సిద్దిపేట లో ఇదే చౌరస్తాలో సభ పెడతాన‌ని సీఎం రేవంత్ ప్ర‌క‌టించారు.

రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేసు కుట్ర‌తోనే…

రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసిఫాబాద్ జన జాతర సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే… దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. 1881నుంచి ప్రతీ పదేళ్లకోసారి జనగణన చేపట్టడం సంప్రదాయంగా వస్తోందని, కానీ 2021 లో బీజేపీ జనగణన చేపట్టలేదు.. బీసీ జనగణన చేపట్టలేదన్నారు. బీసీ జనగణన చేపడితేనే రిజర్వేషన్లు పెంచడం సాధ్యమవుతుంద‌న్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారం చేజిక్కించుకుందన్నారు. ఇవన్నీ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో భాగమేన‌న్నారు. బీజేపీ కి ఓటు వేస్తే… రిజర్వేషన్లపై పోటు వేస్తుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం మీ చేతుల్లోనే ఉందన్నారు.

బీజేపీని ప్రశ్నిస్తున్న నాపై అమిత్ షా ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టిస్తుండన్నారు. బీఆరెస్ ఎన్నో అక్రమ కేసులు పెట్టినా భయపడలేదన్నారు. అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదన్నారు. మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులను కూడా ఎదిరించే శక్తి మీ రేవంతన్నకు వస్తుందన్నారు. మనమంతా బీజేపీ కుట్ర రాయాజకీయలను తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాల‌ని కోరారు. పోడు భూముల పట్టాలు,గిరిజనేతరుల పహానీ సమస్యలు తీరాలంటే, కొమురం భీమ్ ప్రాజెక్టు కట్టాలంటే ఆత్రం సుగుణ గెలవాలన్నారు. తెలంగాణకు వచ్చి ప్రధాని మోదీ నన్ను తిట్టిపోయాడన్నారు. కానీ ఆయ‌న తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేన‌న్నారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.

కేసీఆర్‌, మోదీ పాల‌న‌లో నిర్ల‌క్ష్యానికి గురైన ఆదిలాబాద్‌

కేసీఆర్, మోదీ పాలనలో ఆదిలాబాద్ నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ గోండులకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ సోయం బాపూరావుకు టికెట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ దొరలా, అమిత్ షా దొరలా.. గూడెం నగేష్ కూడా ఒక దొరనేన‌న్నారు. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ లో ఆడబిడ్డకు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. చదువుకున్న ఆడబిడ్డ..సమస్యలపై అవగాహన ఉన్న ఆత్రం సుగుణను గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తాను సీఎం అవగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు నిధులు విడుదల చేశాన‌న్నారు. అమరుల కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించామ‌ని తెలిపారు. సీసీఐ సిమెంటు పరిశ్రమ మూతపడినా మోదీ, కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. వందరోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీద‌న్నారు.

 

Exit mobile version