- ఎన్నికల సభల్లో చెప్పినవే అసెంబ్లీలోనూ
- ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత కూడా
- పాత అంశాలనే లేవనెత్తిన బీఆరెస్
- రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు
- అదే తరహాలో చరిత్ర తవ్విన కాంగ్రెస్
- పరస్పరం దెప్పిపొడుచుకున్న నేతలు
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు వాడివేడిగా సాగాయి. ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం ఏర్పడినా ప్రతిపక్ష బీఆరెస్, అధికార కాంగ్రెస్ ఇంకా ఎన్నికల ప్రచార సభల మూడ్ నుంచి బయటపడినట్టు లేవు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారసభల్లో చేసిన ఆరోపణలనే మళ్లీ ప్రస్తావిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పిదాలు ఎత్తిచూపడంపైనే కేంద్రీకరించారు. రేవంత్‌రెడ్డిపై ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలనే మళ్లీ లేవనెత్తారు. డబ్బులిచ్చి పీసీసీ పదవిని, ముఖ్యమంత్రి పదవిని కొనుక్కున్నారంటూ పాత రికార్డు మళ్లీ వేశారు.
అటు కాంగ్రెస్ సభ్యులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, ఆయనకు అంతకు ముందు కేంద్ర మంత్రి పదవులు ఎవరు ఇచ్చారో ఏకరువు పెట్టారు. గతం గురించి చర్చించాలంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, గతంలో పరిపాలనలో అక్కడున్న నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ గురించి చర్చించుకుంటే మంచిదన్నారు. పాపాలు జరిగాయంటున్నారు కదా, పాపాలలో వారి సంపూర్ణ భాగస్వామ్యం ఉందన్నారు. రాష్ట్రంలో 55 సంవత్సరాల విధ్వంసం గురించి మాట్లాడాలా? వద్దా? అని ప్రశ్నించిన కేటీఆర్.. సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వలేని అసమర్థులని విమర్శించారు. ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదని, మొదటి రోజే అంత ఉలికిపాటు అమాత్యులకు ఎందుకు అన్నారు. గవర్నర్ ప్రసంగం నిర్మాణాత్మంగా ఉంటే తాము కూడా అలానే ఉండేవారన్నారు. మా అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు మూడు నెలల సమయం ప్రభుత్వానికి ఇవ్వాలన్నారని, ఆ ప్రకారంగానే వ్యవహరిస్తామన్నారు.
మధ్యలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సిఎం మల్లు భట్టి మాట్లాడుతూ, 55 ఏళ్ల ఉమ్మడి పాలన సంగతెందుకుని అభ్యంతరం తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, మనం చర్చించాల్సింది 2014 నుంచి అని అన్నారు. సమైక్య పాలన బాగాలేదని, అప్పటి తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదం చేయించామన్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రం అప్పగిస్తే, ఆరున్నర లక్షల రూపాయల అప్పులు చేశారని దెప్పిపొడిచారు. గోదావరి, కష్ణా నుంచి అదనంగా ఎకరాకు నీరు ఇవ్వలేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చారా, ఇళ్లు కట్టించారా అని మల్లు భట్టి నిలదీశారు. వాస్తవానికి బీఆరెస్ తాజాగా చేసిన ఆరోపణలు కాని, వాటికి కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్‌లోగానీ కొత్తేమీ లేదు. దాదాపు నెలరోజులపాటు సాగిన ఎన్నికల ప్రచారసభల్లో చెప్పినవే.
అయితే.. వాటన్నింటినీ ఆలకించిన ప్రజలు.. రేవంత్‌రెడ్డిపై బీఆరెస్ చేసిన విమర్శలు విన్న మెజారిటీ ఓటర్లు.. కాంగ్రెస్‌కే ఓటు వేశారు. అంటే.. కాంగ్రెస్‌పై బీఆరెస్ చేసిన ఆరోపణలను లెక్కలోకి తీసుకోలేదనే అర్థం. అయినా.. ఇప్పటికీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అవే అంశాలను సభలో ప్రస్తావించడంతో వారు ఇంకా ఎన్నికల ప్రచార మూడ్ నుంచి బయటికి రాలేదేమోనన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి
ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు కొనసాగలేదని, ఎన్టీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా కొనసాగలేదని సీసీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. ఓటమిని ప్రజాస్వామ్యంలో స్పోర్టివ్‌గా తీసుకోవాలని హితవు పలికార. అధికారంలోకి కాంగ్రెస్ రాగానే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని బీఆరెస్ హెచ్చరించడం సరికాదన్నారు. గత పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా సభ్యులను కొనుగోళ్లు చేశారని, కానీ.. అమ్ముడుపోయినవారు మళ్లీ ఎన్నికై సభకు రాలేదని గుర్తు చేశారు. ఈ సంస్కతి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తిరుగుబాటు తత్వం ఉన్న తెలంగాణలో అనేక తప్పులు జరిగాయని, ఇకముందు జరగకుండా చూడాలని పాలక, ప్రతిపక్ష పార్టీలకు సాంబశివరావు చురకలు అంటించారు.