Site icon vidhaatha

CM. REVANTH REDDY | హస్తినలో దీక్షపై అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీఆరెస్ సవాళ్ల కుస్తీ :కేసీఆర్‌ను రమ్మను..ఇద్దరం దీక్ష చేస్తామన్నసీఎం రేవంత్‌రెడ్డి

మంత్రివర్గం సచ్చేదాకా దీక్షకు కూర్చోవాలన్న కేటీఆర్‌
నిధులు వచ్చుడో..ఇద్దరం సచ్చుడో తేల్చుకుందామని సవాల్‌

విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న తీర్మానంపై జరిగిన చర్చలో ఢిల్లీలో దీక్ష చేయాలన్న అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి, బీఆరెస్ మాజీ మంత్రులు కేటీఆర్‌, టి.హరీశ్‌రావులకు మధ్య మాటల యుద్ధం సాగింది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. కేటీఆర్ తన ప్రసంగంలో కేంద్రంపై పోరాటంలో..తెలంగాణకు నిధుల సాధనలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర మంత్రివర్గం అంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ధ సచ్చేదాకా దీక్షకు కూర్చోవాలని సూచించారు. మీకు మేం, మా ఎమ్మెల్యేలంతా చుట్ట రక్షణగా ఉంటామన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌, హరీశ్‌రావులకు దీక్షల పట్ల చాల ఆసక్తి ఉన్నట్లుందని, మేం మీలాగా చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని మేమెప్పుడూ పదే పదే చెప్పలేదని, రూ.100 పెట్టి పెట్రోల్ కొన్నారు కానీ, అగ్గిపెట్టే కొనలేదని, అగ్గిపెట్టే మరిచిపోయినట్లుగా నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదని, శ్రీకాంత్‌చారి, యాదయ్య వంటి వారి ప్రాణాల ప్రాతిపదికన అధికారంలోకి రాలేదని, ఇతరుల ప్రాణాలు బలిచ్చి కోల్పోయిన కుర్చీలోకి రావాలన్న ఆలోచన లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల సాధనకు తప్పకుండా జంతర్‌మంతర్‌లో దీక్షకు సిద్ధమన్నారు. మీ కేసీఆర్‌ను రమ్మనండి..ప్రతిపక్ష నేతగా ఆయన, సభానాయకుడిగా నేను కూడా దీక్షలో కూర్చుంటామన్నారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకురావాలన్నారు. మీరే తారీఖు డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్ధమని, తెలంగాణకు నిధులు తెచ్చుడో.. సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రతి స్పందించిన హరీశ్‌రావు నిరుద్యోగుల సమస్యలపై కేటీఆర్‌ను దీక్ష చేయమని, రైతు రుణమాఫీపై నన్ను దీక్ష చేయమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, అన్ని మేమే చేస్తే సభానాయకుడిగా, సీఎంగా మీరెందుకుని ప్రశ్నించారు. మీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నారని, మాది ఉద్యమ స్ఫూర్తి అని, మీలాగా రాజీనామా చేయమంటే పారిపోయిన చరిత్ర మాకు లేదని, మా నాయకుడు చెబితే రెండుసార్లు పదవులను గడ్డి పోచల్లా వదిలేశామన్నారు. మీలాగా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని రైఫిల్ రెడ్డి గా పేరు తెచ్చుకున్న చరిత్ర మాది కాదని, నియాగాంధీని దెయ్యమని, రాహుల్ గాంధీని పప్పు అన్న చరిత్ర నీదని మండిపడ్డారు. మా ఉద్యమ స్ఫూర్తిని అవమానిస్తూ చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని పునరుద్ఘాటించారు. ఢిల్లీ దీక్షకు కేసీఆర్ ఎందుకని, నీవు దీక్ష చేయ్ అని, నీకు వెయ్యి మంది, మా ఎమ్మెల్యేలంతా రక్షణగా ఉంటామన్నారు.

Exit mobile version