Site icon vidhaatha

HARISH RAO | బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ … బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

సంక్షేమ పరిషత్ కు నిధులు విడుదల చేయండి
సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే నేత హరీశ్ రావు ఆరోపంచారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం సంక్షేమ పరిషత్ కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలన్న సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారని లేఖలో తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరమన్నారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడంతో, అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందన్నారు. సీఎంగా కేసీఆర్ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించి, పలు పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ఈ మేరకు పరిష్కరించాల్సిన సమస్యలను లేఖలో పొందుపరిచారు.

పరిష్కరించాల్సిన సమస్యలు…..

1, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
2, విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. వారికి స్కాలర్ షిప్స్ అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి. 2023-24 ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి.
3, బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి.
3, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి.
4, వేద పాఠశాలల్లోని వేద పండితులకు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న రూ.5వేల గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలి.
5, 75 ఏళ్లు పై బడిన వేద పండితులకు ఇచ్చే రూ. 5వేల భృతి ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. వారికి ఆర్థిక చేయూత ఎంతో అవసరం కాబట్టి వెంటనే చెల్లించాలి.
6, సూర్యాపేట, ఖమ్మం, మధిరలో నిర్మించతలపెట్టిన బ్రాహ్మణ సదనాల పనులు ఆగిపోయాయి. వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి.

Exit mobile version