రైతులపై బీఆరెస్‌ది కపట ప్రేమ: ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

రైతులకు బేడీలు వేసి, రుణమాఫీ చేయని బీఆరెస్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు

  • Publish Date - May 16, 2024 / 06:50 PM IST

విధాత, హైదరాబాద్‌ : రైతులకు బేడీలు వేసి, రుణమాఫీ చేయని బీఆరెస్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రైతులను పదేళ్లలో బీఆరెస్‌ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. రైతులను వరి సాగు చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరి వేయలేదా అని నిలదీశారు. అటువంటి బీఆరెస్‌ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ఇవ్వాళ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్‌ మార్చిపోయినప్పటికి సీఎం రేవంత్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారన్నారు.

ధర్నాల పేరుతో రైతులను మరోసారి మోసం చేసే పనిలో కేసీఆర్‌ పడ్డారని దుయ్యబట్టారు. యావత్ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని రెండో స్థానానికి తీసుకొచ్చిన నిర్వాకం కేసీఆర్‌దేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ సర్కార్ నడిపిస్తున్నారన్నారు. గతం కంటే అదనంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు తెరిచి తమ ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ తమది కాదన్నారు. త్వరలోనే రైతులకు సీఎం రేవంత్ తీపికబురు చెబుతారని పేర్కోన్నారు. తెలంగాణలో బీజేపీ గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. మోదీ చరిస్మా తెలంగాణలో పనిచేయలేదన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Latest News