ఆ మూడు సీట్లపై కొనసాగుతున్న సస్పెన్స్‌

ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25వ తేదీ చివరి రోజుకాగా ఇప్పటికి ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల

  • Publish Date - April 23, 2024 / 04:19 PM IST

అధికారిక ప్రకటన రాకుండానే నామినేషన్ల దాఖలు
రఘురామిరెడ్డికే ఖమ్మం టికెట్ !
చక్రం తిప్పిన పొంగులేటి

విధాత : ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25వ తేదీ చివరి రోజుకాగా ఇప్పటికి ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక జరుగకపోవడం అక్కడ టికెట్ల కోసం నాయకుల మధ్య నెలకొన్న పోటీకి నిదర్శనంగా కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సవాల్‌గా మారిపోగా, తమకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదంటూ ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్‌లో వెలిచాల రాజేందర్‌రావులు నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల ఎంపికను మరింత జఠిలం చేస్తుంది. వెలిచాల నామినేషన్లకు మంత్రులు కూడా హాజరవ్వగా, ఈ టికెట్ కోసం పోటీ పడిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అధిష్టానం పేరు ప్రకటించకుండానే వెలిచాల నామినేషన్ ఎలా వేస్తారంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఏఐసీసీ పేరు ఖరారు చేయకుండానే నామినేషన్ దాఖలు చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.

ఖమ్మంలో పొంగులేటిదే పైచేయి
ఉత్కంఠ రేపుతున్న ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో చివరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పైచేయి సాధించినట్లుగా తెలుస్తుంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ఖరారు చేసేలా ఏఐసీసీని ఒప్పించడంలో పొంగులేటి సఫలీకృతమైనట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది. ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వర్‌రావు తన కొడుకు యుగేంధర్‌రావుకు టికెట్ ఇప్పించేందుకు చివరిదాకా ప్రయత్నం చేశారు. వారితో పాటు రఘురాంరెడ్డి, రాయల నాగేశ్వర్‌రావు, మండవ వెంకటేశ్వర్‌రావులు టికెట్ రేసులో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక క్లిష్టతరం కావడంతో ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం…కరీంనగర్‌లో వెలమ సామాజిక వర్గంకు టికెట్ కేటాయించాలని ఏఐసీసీ కసరత్తు చేసింది. అయితే వాటిన్నింటికి చెక్ పెట్టి ఖమ్మం టికెట్‌ను తన వియ్యంకుడైన మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కొడుకు..రామసహాయం రఘురామిరెడ్డికి వచ్చేలా చేయడంలో పొంగులేటి విజయవంతమయ్యారని సమాచారం. దీనికి బలం చేకూరుస్తు పొంగులేటి అనుచరులు రామ సహాయం రఘురామిరెడ్డి తరఫున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రామసహాయం రఘురాంరెడ్డి పెద్దకొడుకుకు సినీ హీరో వెంకటేశ్ కూతురితో పెళ్లికాగా, మరో కుమారుడికి పొంగులేటి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఖమ్మం, కరీంనగర్ సీట్లకు అభ్యర్థులు ఎవరన్నది ఏఐసీసీ తేల్చేవరకు ఈ రకమైన ప్రచారాలకు కొనసాగుతునే ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News