KK Mahender Reddy | బీఆరెస్‌ ఓట్లు బీజేపీకి వేయించారు.. సాక్ష్యాలున్నాయి: కేకే

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకుండా బీఆరెస్‌ ఓట్లను బీజేపీకి కేసీఆర్‌ వేయించారని, ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కేకే. మహేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - May 16, 2024 / 04:58 PM IST

విధాత, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకుండా బీఆరెస్‌ ఓట్లను బీజేపీకి కేసీఆర్‌ వేయించారని, ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కేకే. మహేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మట్లాడారు. రాజకీయ భవిష్యత్తు కోసం బీఆరెస్‌ పార్టీ ప్రధాని మోదీ దగ్గర మోకరిల్లిందని విమర్శించారు. కవితను జైలు నుంచి విడిపించడం కోసం ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓట్లను కేసీఆరే బీజేపీకి వేయించాడని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేయాలని బీఆరెస్‌ నేతలే చెప్పారన్నారు.

ఈ విషయంలో తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ ఉన్నారని, కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని తనను కేసీఆర్ సంప్రదించారని మోడీనే గతంలో స్వయంగా చెప్పారని దీన్ని బట్టి వీరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కోన్ కిస్కా? అని ప్రశ్నించారు.

నీటి విషయంలో బీఆరెస్‌ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేసి సిరిసిల్ల జిల్లాలో పంటపొలాలను ఎండబెట్టి కేసీఆర్ తన పొలాలకు నీళ్లు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేశారని ఆరోపించారు. పద్మశాలిలు నిరోద్‌లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్‌ ఆండ్‌ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన వాటిని అమ్ముకుంటే తప్పు లేదని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News