Site icon vidhaatha

నిర్ల‌క్ష్యం వ‌ల్లే భారీగా క‌రోనా కేసులు.. మంత్రి హ‌రీశ్

విధాత‌(మెదక్): కరోనా బారిన ప‌డిన కొంద‌రు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే వ్యాధి తీవ్రత పెరుగుతోంద‌ని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కోవిడ్ సోకిన వారు ఇళ్ల‌ల్లో ఉండ‌కుండా య‌థేచ్ఛ‌గా తిర‌గ‌డం వ‌ల్ల వారితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామంలోని ఇతరులు వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో కొవిడ్, ధాన్యం కొనుగోలు, పురపాలికలో వైకుంఠ‌ ధామాలు, డంప్ యార్డులు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కలెక్టర్ హరీశ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంటింటి సర్వే ప్రారంభించాం
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మన జిల్లాలో 581 బృందాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 6126 మందిని గుర్తించామని అనగా 4.5 శాతం మాత్రమేనని అందులో 3,491 మందికి కోవిడ్ మందుల కిట్లు, ప్రిస్క్రిప్షన్ అందించడంతో పాటు స్వల్ప లక్షణాలున్న మరికొందరికి మందులు అందించారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజ‌న్‌తో కూడిన 260 పడకలు అందుబాటులో ఉన్నాయని, కాగా అందులో ప్రస్తుతం 42 మంది కొవిడ్ రోగులు ఉన్నారన్నారు. ఇంకా 218 పడకలు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.

మాస్క్ లేకుంటే జ‌రిమానా
జిలాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, ఇతర మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 తరువాత 45 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోసు టీకా వేస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, అత్యవసర పరిస్థిని గుర్తించి ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని కాబట్టి గ్రామాలలో అందరు స్వీయ నియంత్రణ పాటించేలా ప్రజా ప్రతినిధులు చూడాలని, మాస్కు ధరించని వారికి రూ. 500 జ‌రిమానా విధించాల్సిందిగా సూచించారు.

రైతుల‌ ఖాతాల్లో రూ. 91 కోట్లు జ‌మ‌
ధాన్యం కొనుగోళ్ల‌పై స‌మీక్షించిన మంత్రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 91 కోట్లు రైతుల‌ ఖాతాలలో జ‌మ చేసిన‌ట్లు చెప్పారు. లేబ‌ర్ కొర‌త లేకుండా చూసుకోవాల్సిందిగా రైస్ మిల్లుల అధ్యక్షులు చందపాల్‌కు మంత్రి సూచించారు. లారీలు తమకు కేటాయించిన పాయింట్ కు ధాన్యం తరలించకుండా ఇతర మార్గాలు అన్వేషిస్తే అట్టి వాటిని సీజ్ చేయాలన్నారు.

అనంత‌రం నాలుగు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల ప్రగతి, తూప్రాన్‌లో రోడ్ వెడల్పుకు స్థలాల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత కమిష‌నర్ల‌తో మంత్రి స‌మీక్షించారు. అనంతరం మార్కెట్ కమిట్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంబించారు. మెదక్, హవేలీ ఘనపూర్ లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారాక్ చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version