- అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్
- ఇవ్వకపోతే రాజకీయ నేతల ఇళ్ళు ముట్టడిస్తామని హెచ్చరిక
విధాత, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్(SC Corporation Chairman) బండ శ్రీనివాస్(Banda Srinivas)కు దళిత బంధు(Dalitha bandhu) సెగ తగిలింది. దళిత బంధు రాని బాధితులు ఆదివారం ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అంతకుముందు స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో కలుసుకొన్న బాధితులు తమ బాధలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అనంతరం ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో గేటుకు తమ డిమాండ్ల పత్రాన్ని అంటించారు.
ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన దళిత బంధు పథకం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నట్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలో 100శాతం దళిత బంధు అమలు ఉత్తదేనన్నారు. నియోజకవర్గంలో ఇంకా వందల కుటుంబాలకు దళితబంధు రాలేదన్నారు. రేషన్ కార్డుతో ఈ పథకానికి ముడి పెట్టి
అర్హులైన వారికి పథకాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట్లో రేషన్ కార్డు లేకున్నా దళిత బంధు ఇచ్చారని, ఇప్పుడు రేషన్ కార్డు అంటూ కొత్త నిబంధన తెరపైకి తెచ్చారన్నారు. సంవత్సర కాలంగా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, క్లస్టర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న వారు లేరన్నారు. అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని, లేనట్లయితే, ఇచ్చేంత వరకూ పోరాటం చేస్తామన్నారు. ఇవ్వకపోతే రాజకీయ నాయకుల ఇళ్ళు ముట్టడిస్తామని హెచ్చరించారు.