విధాత : నాగార్జునసాగర్ వాటర్ ట్యాంకులో కోతులు పడి చనిపోగా గమనించక అదే నీటిని సరఫరా చేసిన ఘటన మరువకముందే నల్లగొండలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ దఫా కోతుల బదులు మనిషి మృతదేహం వాటర్ ట్యాంకులో ప్రత్యక్షమైంది. నల్లగొండ మున్సిపాలిటీలోని11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో నీళ్లను తనిఖీ చేస్తుండగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు.
చనిపోయిన వ్యక్తి పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కూడా నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వినియోగించామని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.