Site icon vidhaatha

ఈటెల‌ను సాగ‌నంపేందుకే పొగ‌బెడుతున్నారా?

ఈటెల‌ను సాగ‌నంపేందుకే పొగ‌బెడుతున్నారా?

ఒక మంత్రిపై ఆరోప‌ణ‌లు వ‌స్తే…వెంట‌నే సీఎం స్పందించ‌డం దేనికి?
బీసీ సంఘాల్లో చ‌ర్చ‌
ముక్కుసూటిగా మాట్లాడ‌ట‌మే ఈటెల నేర‌మా?
కేటీఆర్‌కు అడ్డు తొలిగించుకునేందుకే అంటున్న బీసీ సంఘాలు

గత కొన్ని నెలలుగా తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కి పొమ్మనకుండానే టీఆర్ఎస్ లో పొగపెడుతున్నారని ప‌లువురు బీసీ సంఘాల నాయ‌కులు భావిస్తున్నారు. వాటికి బలం చేకూరేట్లు ఈటల రాజేందర్ భూకబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం, బాధితులు నేరుగా సీఎం కేసీఆర్ కి లేఖ రాయడం, ఆయన వెంటనే విచారణకు ఆదేశించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలన్నీ టీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఒకేసారి ప్రముఖంగా రావడం, దీని వెనుక‌ ముఖ్య నేత‌లు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని బీసీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
అసలేం జరిగింది..?
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఇటీవల సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. 1994లో ప్రభుత్వం సర్వే నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికీ 1 ఎకరం 20 కుంటల చొప్పున, సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు వారు లేఖలో తెలిపారు. ఇటీవల ఈ భూముల సమీపంలో మంత్రి ఈటల రాజేందర్ కోళ్లఫారంలు ఏర్పాటు చేయాలనుకున్నారని, దీంతో సదరు అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. జమున హేచరీస్ పేరుతో ఇప్పటికే అక్కడ 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల అనుచరులు ఆక్రమించారని, అక్కడ పౌల్ట్రీకి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయని కూడా టిఆర్ ఎస్ అనుకూల టీవీల్లో ఒక్క‌సారిగా వార్తా క‌థ‌నాలు ప్రసారం అయ్యాయి. క‌నీసం మంత్రిని వివ‌ర‌ణ అడ‌గ‌కుండానే, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై స్పందించిన‌ట్లు ఈటల వ్యవహారంపై సీఎం కేసీఆర్ నేరుగా దృష్టిసారించడం ఇక్కడ కొసమెరుపు. అయితే ఇదంతా కేటీఆర్‌, కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన వ్య‌వ‌హారంగా బీసీ నేత‌లు భావిస్తున్నారు. ఈటెల రాజేంద‌ర్ స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం, ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ఎత్తి చూప‌డం, కేటీఆర్ సీఎం వ్య‌వ‌హారంపై బ‌హిరంగంగానే కామెంట్లు చేయ‌డం వంటి కార‌ణాల‌తో కేసీఆర్ కుటుంబం ఈటెల‌పై ప‌గ‌బ‌ట్టింద‌ని, వారి ఒత్తిడి మేర‌కే సీఎం త‌నతోపాటు తొలినాళ్ల నుంచి ఉద్య‌మంలో చురుకైన పాత్ర పోషించిన ఈటెల‌పై విచార‌ణ‌కు ఆదేశించి దూరం చేసుకున్నార‌ని బీసీ సంఘాల నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సమగ్ర దర్యాప్తుకి కేసీఆర్ ఆదేశం..
మంత్రి ఈటలపై వచ్చిన ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు ని కూడా సీఎం ఆదేశించారు. సత్వరమే ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలిచ్చారు. ఈటల వ్యవహారంలో చకచకా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Exit mobile version