యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు

నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో 4వేల మెగావాట్లతో నిర్మిస్తున్న యాదాద్రి మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది

  • Publish Date - April 25, 2024 / 01:50 PM IST

విద్యుత్తు ఉత్పత్తికి లైన్ క్లియర్‌

విధాత : నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో 4వేల మెగావాట్లతో నిర్మిస్తున్న యాదాద్రి మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం సూచన మేరకు మరో విడత ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపడంతో కేంద్ర ఆటవీ పర్యావరణ శాఖ ప్లాంటులో విద్యుత్తు ఉత్పత్తికి అనుమతులు జారీ చేసింది. యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంటు నిర్మాణంతో వెలువడే కాలుష్యంతో అమ్రామాద్‌అభయారణ్యంలో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందంటూ ఓ స్వచ్చంద సంస్థ జాతీయ హారిత ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ)లో కేసు వేసింది. దీంతో మరోసారి విచారణ చేసి పర్యావరణ అనుమతి(ఈసీ)జారీ చేయాలని ఎన్‌జీటీ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో గత నెల 5,8తేదీల్లో ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి ఈఏసీకి నివేదిక పంపగా, ఈ నివేదిక ఆధారంగా అనుమతులు లభించాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును తొలుత 25,099.42కోట్ల వ్యయంతో ప్రారంభించగా, పెరిగిన అంచనాలతో 34,542.95కోట్లకు చేరింది. కాలుష్య నివారణ..పర్యావరణ పరిరక్షణ చర్యలకే 5,681.44కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా ఈఏసీకి పంపిన ప్రతిపాదనల్లో జెన్‌కో నివేదించింది. ఫ్లాంటులో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైన తర్వారా ఏటా 490.17కోట్లును కాలుష్య నియంత్రణకు ఖర్చు పెడుతామని తెలిపింది.

అక్టోబర్‌ చివరిలోగా ఉత్పత్తి షురూ

యాదాద్రి మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు లైన్‌ క్లియర్‌ కావడంతో త్వరలో ఈ ప్లాంట్‌ను వినియోగంలోకి రానున్నది. తొలుత స్ట్రీమ్‌ జనరేటర్లు, ఇతర యంత్రాల పనితీరును పరిశీలించి అక్టోబర్‌ చివరిలోగా ఈ ప్లాంట్‌లో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.. తొలి విడతలో రెండు ప్లాంట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు టీఎస్‌ జెన్‌కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లాంటు ద్వారా 2వేల మందికి ప్రతక్ష్యంగా, మరో 2వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఏటా సింగరేణి నుంచి 1కోటి 40లక్షల బొగ్గును ఫ్లాంటుకు తరలిస్తారు. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించినప్పుడు 30శాతం బూడిద వెలువడుతుందని , 50కిలోమీటర్ల దూరంలోని 14సిమెంటు పరిశ్రమలకు ఎప్పటికప్పుడు బూడిదను తరలించి కాలుష్య సమస్యలు తలెత్తకుండా చూస్తామని జెన్‌కో పేర్కోంది. ఫ్లాంటు పరిసరాల్లో 45ఎకరాల్లో 27,900మొక్కలు పెంచి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని, వచ్చే జూన్‌కల్లా చుట్టు వంద మీటర్ల పరిధిలో తుంగపాడు వాగు వెంట మూడువరుసల్లో మొక్కలు నాటుతామని జెన్‌కో తన నివేదికలో తెలిపింది.

Latest News