Etela Rajender | బీజేపీ 12స్థానాల్లో గెలువబోతుంది.. గ్రాడ్యూయేట్ ఎన్నికల్లోనూ గెలుస్తాం: ఈటల

పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ యువత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారని, తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించే శక్తి సత్తా ఈరోజు బీజేపీకే మాత్రం ఉందని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు

  • Publish Date - May 16, 2024 / 03:45 PM IST

తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కోంటున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

విధాత: పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ యువత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారని, తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించే శక్తి సత్తా ఈరోజు బీజేపీకే మాత్రం ఉందని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, పార్టీలంటే ఇష్టం లేని వ్యక్తులు కూడా ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీకి ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారన్నారు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ వర్గాలన్ని కూడా బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో మద్దతునిచ్చారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 12స్థానాల్లో గెలవబోతుందన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానంలోనూ నువ్వానేనా అన్న పోటీ నిచ్చిందని ఇక్కడ కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ జిల్లాలు చైతన్యానికి మారుపేరని, ఈ జిల్లాల పట్టభద్రులు సైతం దేశం కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం మనుగడకు చట్టసభల్లో ప్రతిపక్షాల సభ్యులు ఉండాల్సిన అవసరముందని అందుకోసం బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. నరేంద్రమోదీ ఏలుబడిలో ఆర్ధికంగా, ఆత్మగౌరవ పరంగా ఎదిగిందని, ప్రపంచ చిత్ర పటంలో భారత దేశాన్ని సమున్నత స్థానంలో నిలిపారన్నారు.

తక్కువ కాలంలోనే వ్యతిరేకత ఎదుర్కోంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ కొట్టించుకున్న సీఎం రేవంత్‌రెడ్డినేనని, అలవికాని, అబద్ధాల హామీలతో పాటు బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా అప్పట్లో కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో కాలిన మోటార్లు, కరెంటు కోతలు, ఎండిన పంటలు, లంచాల పర్వాలు పునావృతమవుతున్నాయన్నారు. దందాలు, పైసల వసూలు తప్ప నిజాయితీతో కూడిన పాలన లేదన్నారు. 4లక్షల 63వేల మంది పట్టభద్రులకు మేమొచ్చి ఓటు వేయమని చెప్పాల్సిన అవసరం లేదని, వారంతా విద్యావంతులైనందునా వారి ఆలోచించి బీజేపీకి ఓటు వేస్తారన్న నమ్మకం ఉందన్నారు.

ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి వచ్చి పట్టభద్రులను కలుస్తామన్నారు. గుజ్జల ప్రేమెందర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ప్రజలు ఎప్పుడు ఒకవైపు ఉండరని, పార్టీల పరంగా కొంత శాతం ఓటు బ్యాంకులున్నా 75శాతం ప్రజానీకం స్చేచ్చగా పరిస్థితుల మేరకు ఓటు వేస్తారన్నారు. అలాంటి ప్రజాతీర్పుతోనే 2 సీట్లున్న బీజేపీ 300సీట్లను సాధించి పదేళ్లు అధికారం చేసిందని, ఈ దఫా 400సీట్లు లక్ష్యంగా సాగుతుందన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కల్గిన కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద నిలబడే ప్రయత్నంలో ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేశారన్నారు.

2014లోనూ ఇదే రకంగా మోదీ ప్రధాని అయితే మతకలహాలు సాగుతాయని ప్రచారం చేశారని, పదేళ్లు ప్రశాంతమైన సుస్థిరమైన పాలన అందించారన్నారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీనే దేశంలో పేదరికం, అంతర్గత సమస్యలకు కారణమని, దేశంలోని అత్యధిక స్కామ్‌లు కాంగ్రెస్ హయాంలోనే జరిగినవేనన్నారు. బీఆరెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వస్తాయని కేంద్రంలో కీ రోల్ పోషిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలు హస్యాస్పదమని, ఆయన మీద ఆయనకే విశ్వాసం లేదని, ఇక దేశంలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

Latest News