Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు( Harish Rao ) అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు( Birth Day Wishes ) తెలిపారు. నువ్వు బర్త్‌డే జరుపుకుంటే మా కంటగింపు ఏం లేదు.. కానీ ప్రజలను మంచిగా చూసుకో చాలు అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు.
సిద్దిపేట( Siddipeta ) రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. రైతులతో( farmers ) మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతుల వడ్లు దళారుల పాలయ్యాయి. ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందు ప్రభుత్వం. రైతు బంధు ఎగబెట్టారు, రుణమాఫీ మోసం చేశారు. రేవంత్ సర్కార్ చేతకానితనం రైతులకు నష్టాన్ని కలిగిస్తుంది. కరెంటు సరఫరా సక్రమంగా లేక యాసంగి పంట వేసేందుకు రైతులు భయపడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్( KCR ) ఉండగా దవాఖానకు పోతే కేసీఆర్ కిట్( KCR Kit ), ఆడపిల్ల పుడితే రూ. 13,000 ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టి తల్లిని పిల్లను ఇంటిదగ్గర దించిపోవు. ఇప్పుడు కేసీఆర్ కిట్ బంద్ పెట్టితివి, ఆడబిడ్డలకు చీరలు బంద్ పెడితివి, రైతు బంధు( Rythu Bandhu ) ఎగబెట్టిండు, రెండు నెలలు పెన్షన్( Pension ) కూడా ఎగబెడితివి. రూ. 4 వేలు పెన్షన్ ఇస్తా అని కేసీఆర్ ఇస్తున్న రూ. 2 వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగబెట్టిండు. ముసలోళ్ల పెన్షన్ కూడా ఎగబెట్టిన పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు మండిపడ్డారు.
దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..? యాదగిరి లక్ష్మి నరసింహా స్వామి మీద ఒట్టు పెట్టి అటున్న సూర్యుడు ఇటు పొడిసిన పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తానని మాటతప్పినందుకు తప్పయిందని దేవుని ముందు ముక్కు నేలకు రాయి.. పాలకుడే పాపాత్ముడైతే ఆ రాజ్యానికి అరిష్టం అయితది అంట. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే దేవునిమీద ఒట్టు చేసి మాటతప్పితే ప్రజలకు ఏమైనా నష్టం కాజిక్కా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది ప్రజలకు మంచి చెయ్యి, కానీ ఇట్లా మోసం చేస్తే మంత్రం విడిచిపెట్టం. రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చెయ్యాల్సిందే, పంట కొనాల్సిందే అప్పటి వరకు నిన్ను విడిచి పెట్టం. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం, రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదని హరీశ్‌రావు పేర్కొన్నారు.