విధాత: గాఢ నిద్రలో భాగ్యనగరం.. రోడ్లపై అక్కడక్కడ జనం.. పలుచగా వాహనాల సంచారం.. ఖరీదైన కారు స్పీడ్‌గా దూసుకొచ్చింది. అదుపుతప్పి బారికేడ్లను ఢీకొట్టింది.. అదృష్టం బాగుండి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.. ఆ ప్రాంతం మాజీ సీఎం క్యాంపు కార్యాలయం కావడంతో క్షణాల్లో పోలీసులు వచ్చారు.. మద్యం మత్తులో తూలుతున్న కారులోని సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలను (యువతీయువకులు) అదుపులోకి తీసుకున్నారు. ఈ పిల్లలు వెంటనే తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. జరిగిన విషయం చెప్పారు.. వెంటనే పోలీసుల ఫోన్లు మోగాయి. చర్చలు నడిచాయి.
సీన్ రివర్స్ అయింది. కారు నడిపి బీభత్సం సృష్టించిన యువకుడి (మాజీ ఎమ్మెల్యే కొడుకు) స్థానంలోకి మరో వ్యక్తి వచ్చాడు. అతడినే పోలీసులు తెరపైకి తెచ్చారు. అతడినే ఠాణాకు తరలించారు. తదుపరి అసలు నిందితుడు విదేశాలకు చెక్కేశాడు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిందితుడైన యువకుడు విపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తేలింది. విపక్ష నేతలు ఎక్కడ దొరుకుతారా? ఎప్పుడు ఉచ్చు బిగిద్దామా? అని ఎదురుచూస్తున్న అధికార పార్టీకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు హిట్ అండ్ రన్ కేసు దొరికింది.
దర్యాప్తు చేస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించేందుకు అనేక మంది చేతులు కలిపారు. కొంత ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు మద్దతు పలికింది. చిన్న హిట్ అండ్ రన్ కేసు నుంచి తన కొడుకును రక్షించేందుకు మాజీ ఎమ్మెల్యే చట్టాన్ని అతిక్రమించాడు.
ఇందుకు నిందితుడి మామ, బావమరిది, ఇంట్లోని పనివాళ్లు, పోలీసులు ఉన్నతాధికారులు శక్తిమేర సహకారం అందించారు. మొత్తానికి అతడిని తప్పించారు. కానీ, పోలీసు దర్యాప్తులో అందరి బాగోతాలు బయట పడ్డాయి. ఇద్దరు సీఐలు కూడా ఇందులో ఉండటం సామాన్య ప్రజలను విస్మయానికి గురిచేసింది.
ఎందుకు చిన్న హిట్ అండ్ రన్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కొడుకు దోస్తులతో ఎంజాయ్ చేస్తూ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ బారికేడ్లను ఢీకొట్టాడు. నిజాయితీగా తప్పును ఒప్పుకొని ఉంటే చిన్న జరిమానాతో పోయేది కావచ్చు. కానీ, ఇప్పుడు లుకౌట్ నోటీసులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ర్యాష్ డ్రైవింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నదెవరు? గతంలోనూ కేబీఆర్ పార్క్ సమీపంలో ప్రముఖ సినీనటుడి కుమారుడు కూడా ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను కొట్టాడు.
ఆ సమయంలో అక్కడ జనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనాస్థలి నుంచి ఆటోలో వెళ్లిన నటుడి కుమారుడి స్థానంలోకి మరొకరు వచ్చారు. నిందితుడు క్లీన్‌గా కేసు నుంచి బయటపడ్డాడు. ఈ కేసు ఏమైందో కూడా తెలియదు. సంపన్నకుటుంబాల పిల్లలకు సంబంధించిన చాలా ఘటనలు ఇలా శూన్యంలో కలిసిపోతాయి. కొన్ని మాత్రమే మీడియా, సమాజం దృష్టికి వస్తాయి. వాటిని సైతం నీరుగార్చేందుకు అనేక ఉపాయాలు వారికి సిద్ధంగా ఉంటాయి.
అన్ని ఘటనలు ఒకేరకంగా ఉండవు. టైమ్ బాగోలేనప్పుడు తాడే పామై కాటేస్తుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పొలిటికల్ కుటుంబాల మధ్య సహజంగానే కొంత సహకారం ఉండటం సహజమే. కానీ, ప్రజాభవన్ ప్రమాద ఘటన రివర్స్ అయింది. చాలావరకు ప్రజాప్రతినిధుల పిల్లలకు సంబంధించిన అసలు వ్యవహారాలు బయటపడవు. తమ రాజకీయ, వ్యాపార భవిష్యత్తు క్లీన్‌గా ఉండాలని భావిస్తుంటారు.
ఇలాంటి తరహా ఘటనలు జరిగి మీడియా దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే వాటికి మసిపూసి మారేడుకాయ చేసి తప్పించుకుంటారు. ప్రజాప్రతినిధులైన తల్లిదండ్రులే సిస్టమ్‌కు దొరకుండా తప్పించుకోవడాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పుతున్నప్పుడు.. వారు భవిష్యత్తులో సక్రమంగా ఎందుకు పెరుగుతారు? అక్రమ మార్గాన్నే ఎంచుకుంటారు. అక్రమ మార్గంలోనే పయనిస్తారు. దొంగ బుద్ధి నేర్పితే మంచోడైతడా?
-ప్రజ్వల