కానరాని నాటి వైభవం.. కేసీఆర్ పొలం బాటకు కరవైన జనం

  • Publish Date - April 5, 2024 / 12:52 PM IST

మాజీ ముఖ్యమంత్రి పర్యటను పట్టించుకోని గ్రామస్తులు

విధాత బ్యూరో, కరీంనగర్: గతంలో మాదిరిగా, హంగులు, ఆర్భాటాలు, ప్రజానీరాజనాలకు దూరంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కరీంనగర్ పర్యటన ప్రారంభమైంది. కెసిఆర్ పొలం బాట కార్యక్రమానికి ప్రజానీకం నుండి స్పందన కరువైంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న నేత ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు.

కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ గ్రామంలో నిర్ణీత సమయానికి ఉదయం 10 గంటలకు మాజీ ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం వరకు ఆయన గ్రామానికి చేరుకోలేదు. ఉద్యమ నేతగా, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రశేఖర రావు తమ గ్రామానికి విచ్చేస్తున్నప్పటికీ, గ్రామస్తుల నుండి పెద్దగా స్పందన కనిపించలేదు. మీడియా హడావిడి మినహాయించి, కనీసం వందమంది స్థానికులు కూడా కేసీఆర్ సందర్శించే పంట పొలాల వద్ద అగుపించకపోవడం, ఈ పర్యటనకు ప్రజాస్పదన లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. తమ సమస్యలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి గ్రామానికి వస్తున్నప్పటికీ, స్థానిక రైతుల నుండి పెద్దగా స్పందన లేదు. అధికారంలో ఉన్నన్ని నాళ్ళు ఆకాశమార్గంలో, ఆర్భాటంతో సాగిన కెసిఆర్ పర్యటనలతో పోలిస్తే, శుక్రవారం నాటి కరీంనగర్ పర్యటన పేలవంగా కొనసాగింది.

ఇటీవల ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలలో కెసిఆర్ జరిపిన పొలం బాట కార్యక్రమానికి అంతో ఇంతో స్పందన కనిపించినా, ఉద్యమాల పురిటిగడ్డగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి వేదికగా నిలిచిన కరీంనగర్ లో మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఇంత పేలవంగా జరగడం “అధికారాంతమున.. నానుడిని గుర్తుకు తెప్పించింది.

సాక్షాత్తు తమ పార్టీ అధినాయకుడు, రైతు సమస్యలను పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసినప్పటికీ, పార్టీ నేతలు జన సమీకరణ విషయంలో పెద్దగా దృష్టి సారించలేదు. ఓవైపు ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి పంట పొలాలు పరిశీలించే ప్రదేశంలో కనీస ఏర్పాట్లు చేయని పరిస్థితి. దీంతో వచ్చిన కొద్ది మంది సైతం మండుటెండల్లో ఆయన రాక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటనపై అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఒకరోజు ముందే విమర్శనాస్త్రాలు సంధించాయి. పదేళ్ల అధికారంలో రైతుల సమస్యలు పట్టించుకోని ఆయన ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తారని ప్రశ్నల వర్షం సంధించాయి. జిల్లా రైతులకు మొదట క్షమాపణ చెప్పి, ముక్కు భూమికి రాసి ఆ తర్వాత జిల్లాలో అడుగు పెట్టాలని ఆ రెండు పార్టీలు డిమాండ్ చేశాయి.

లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన పొలం బాట బీఆర్ఎస్ కు అంతో ఇంతో మైలేజీ ఇస్తుందనుకుంటే, అటు జనం లేక, ఇటు రైతుల నుండి స్పందన లేక , కార్యక్రమం పరిసరాల్లో వేళ్లపై లెక్కించేంతమంది జనం లేక వెలవెల పోవడం ఆ పార్టీ వర్గాలకు జీర్ణించుకోలేని పరిణామం.

Latest News