- గత కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసిన సీసీ
- పోలీసులకు ఫిర్యాదు
- రహస్యంగా అధికారుల విచారణ
- అన్వేష్ సస్పెన్షన్కు రంగం సిద్ధం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీసీగా గతంలో పనిచేసి, ప్రస్తుతం ఆర్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అన్వేష్ పై ఫోర్జరీ కేసు నమోదైనట్టు సమాచారం. గతంలో కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి, రూ.2.31 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణ వ్యక్తం అవుతోంది. ఈ సంఘటన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక మట్టెవాడ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
గతంలో కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన పమేలా సత్పతి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. తాను కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ స్వాహా వ్యవహారాన్ని ఆమె పసిగట్టి గోప్యంగా విచారణ జరిపించినట్లు చెబుతున్నారు. ఎన్నికల వ్యయాన్ని ఆసరా తీసుకొని ఈ స్వాహాకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో వెల్లడైనట్లు భావిస్తున్నారు. ఆమె కొద్ది రోజుల క్రితమే యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు కమిషనర్లు మారారు.
అయినప్పటికీ పమేలా సత్పతి ఈ వ్యవహారంపై దృష్టిని కేంద్రీకరించి విచారణ కొనసాగించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫోర్జరీ వ్యవహారం బయటికి రావడం గమనార్హం. ఈ మేరకు కాజీపేట సర్కిల్ పరిధిలో ప్రస్తుతం ఆర్ఐగా పనిచేస్తున్న అన్వేష్ పై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ సెలవుల కారణంగా ఇంకా అధికారికంగా నిర్ణయం వెల్లడించలేదని సమాచారం. ఈ వ్యవహారంలో అన్వేష్ పాత్రతో పాటు ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత శాఖాపరమైన విచారణ అధికారులు రహస్యంగా నిర్వహిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈనెల ఆరవ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కొంత ఈ విషయమై జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.