క్రియాశీలక రాజకీయాలకు లైన్ క్లియర్
విధాత, హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆరెస్) తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆరెస్ తీసుకున్నారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గడల 2018 మే 28న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వచ్చిన కొద్ది రోజుల్లోనే 2023 డిసెంబర్ 20న ఆయనను పోస్టు నుంచి తప్పించింది. కొంతకాలం ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆరెస్‌కు దరఖాస్తు చేశారు. ఆ ఫైల్ ను కొద్ది రోజులపాటు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దీంతో మరోసారి ఆయన వీఆరెస్‌కు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత గత నెల 27న ఆయనకు మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా నియమించింది. ఆయన లాంగ్ లీవ్ లో ఉండటంతో జాయిన్ అవ్వలేదు.
ఇటీవల ఆయన స్వయంగా హెల్త్ సెక్రటరీని కలిసి తన వీఆరెస్‌ను ఆమోదించాలని కోరారు. ఫైల్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన సెక్రటరీ, ప్రభుత్వం నుంచి ఆమోదం తెలుపుతూ తెలుపుతూ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో హెల్త్ డైరక్టర్‌గా గడల శ్రీనివాస్‌రావు కోవిడ్ సమయంలో మంచిపనితీరు కనబరిచారు. ఈ క్రమంలో బీఆరెస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్‌తో నెలకొన్న సాన్నిహిత్యం నేపథ్యంలో గడలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసే లక్ష్యంతో తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపులు, జాబ్ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడం ఆయనను నిరాశ పరిచింది. తదుపరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను డెరక్టర్ పోస్టు నుంచి తప్పించిన నేపథ్యంలో వీఆరెస్‌కు నిర్ణయించుకున్నారు. మునుముందు ఆయన క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారని తెలుస్తుంది.