Site icon vidhaatha

ఆదిలాబాద్ ఏజేన్సీ ప్రాంత‌ ముస్లింలతో ప్రభుత్వం చ‌ర్చలు

శాంతి నెల‌కొల్పేందుకు త్వర‌లో ఉమ్మడి స‌మావేశం

ఆదివాసీ చ‌ట్టాల‌ను గౌరవించాలి

మ‌త శ‌క్తుల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండాలి

దుష్టశ‌క్తులు పెట్రేగే అవ‌కాశాల‌కు తావివ్వోద్దు

యువ‌త‌ను స‌న్మార్గంలో న‌డిపిలా అవ‌గాహ‌న క‌ల్పించండి

స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌, షబ్బీర్ అలీ, వెడ్మా బొజ్జు

ఆదిలాబాద్ లో జ‌రిగిన జైనూరు ఘ‌ట‌న నేప‌థ్యంలో స్థానిక ఆదివాసీ, మైనారిటీ వ‌ర్గాల మ‌ద్య స‌యోధ్య కుదుర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వ‌రుస బేటీలు నిర్వ‌హిస్తుంది. రెండు రోజుల క్రితం ఉట్నూర్ లో ఆదివాసీ సంఘాల‌తో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప‌టేల్ చ‌ర్చలు జ‌రపగా..తాజాగా మైనారిటీ వ‌ర్గానికి చెందిన పెద్దల‌తో మంగ‌ళ‌వారం స‌చివాలయంలో ప్రభుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీ, మంత్రి సీత‌క్క‌, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప‌టేల్, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి స‌మావేశం అయ్యారు.

స‌మ‌స్య మూలాల‌తో పాటు ప‌రిష్కార మార్గాల‌ను సూచించాల‌ని కోర‌గా మైనారిటి పెద్ద‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్యక్తం చేసారు. వ్యక్తిగ‌త విభేదాల‌కు మ‌తం రంగు పూస్తూ..మ‌తాల మ‌ద్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు ప్రయ‌త్నిస్తున్నాయ‌ని, ఆ శ‌క్తుల‌ను క‌ట్టడి చేసేలా బందోబ‌స్తు పెంచాల‌ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఎంతో కాలంగా స‌ఖ్యత‌తో నివ‌సించిన రెండు వ‌ర్గాల మ‌ద్య వైష‌మ్యాలు రెచ్చ గొట్టే మూక‌ల‌పై క‌ఠిన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని కోరారు. మూడు గంట‌లకు పైగా సాగిన స‌మావేశంలో మైనారిటి పెద్దలు వ్యక్త ప‌రిచిన అభిప్రాయాల‌ను సావ‌దానంగా విన్నారు. అనంత‌రం ప్రభుత్వం త‌రుపున మంత్రి సీత‌క్క‌, ప్రభుత్వ స‌ల‌హ‌దారు ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ..మ‌త రాజ‌కీయాల ప‌ట్ల త‌మ ప్రభుత్వం క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తుంద‌ని హెచ్చరించారు.

నిజాం హాయం నుంచి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో స‌ఖ్యత‌గా మెలిగిన ఆదివాసి, మైనారిటి వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు త‌లెత్తడం ప‌ట్ల మంత్రి సీత‌క్క విచారం వ్యక్తం చేశారు. స‌మ‌స్య మూలాలను గుర్తించి ప‌రిష్కరిస్తామ‌ని చెప్పారు. ఆదివాసీల‌కు ప్రత్యేక చ‌ట్టాలున్నందున వాటిని మైనారిటీలు గౌర‌వించాల‌ని కోరారు. కొంత మంది యువ‌కులు చేస్తున్న చేష్టలను చూపి.. మైనారిటీల ప‌ట్ల వ్యతిరేక భావ‌న‌ను క‌లిగించేందుకు కొన్ని దుష్ట శ‌క్తులు ప్రయ‌త్నిస్తాయ‌ని..అందుకే మైనారిటీ యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఆదివాసీ చ‌ట్టాల‌ను, మ‌హిళ‌ల‌ను గౌర‌వించేలా ప్రార్ధన మందిరాల్లో అవ‌గాహ‌న కార్యక్రమాలు చేప‌ట్టాలన్నారు.

అయితే ఏజెన్సీ ఏరియాల్లో, వెన‌క‌బ‌డిన ప్రాంతాల్లో ప‌దేండ్లుగా ఉపాధి ఉద్యోగ అవ‌కాశాలు లేనందున‌….ప్రజ‌లుఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. నిరుద్యోగ స‌మ‌స్య ఆస‌ర‌గా యువ‌త‌ను త‌మ స్వార్ధ రాజ‌కీయాల‌ను కొన్ని శ‌క్తులు వాడుకుంటున్నాయ‌ని..వాటి ప‌ట్ల త‌మ ప్రభుత్వం క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తుందని తెలిపారు. ఏద‌న్నా సమ‌స్య త‌లెత్తితే…శాంతియుతంగా నిర‌స‌న తెల‌పాలి త‌ప్పితే…చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి ఎవ‌రు తీసుకున్నా త‌మ ప్రభుత్వం ఉపేక్షేంచ‌ద‌ని హెచ్చరించారు. వ‌ర్గాలు, కులాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగితే అభివృద్ది కుంటుప‌డుతుంద‌ని చెప్పారు. అందుకే అన్ని వ‌ర్గాల ప్రజ‌లు స‌ఖ్యత‌తో మెల‌గాల‌ని చెప్పారు.

రెండు వ‌ర్గాల‌ మ‌ధ్య నెల‌కొన్నఅపనమ్మకాన్ని పొగెట్టేలా ఇరు ప‌క్షాల పెద్దలతో త్వర‌లో ఉమ్మడి స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని ప్రభుత్వ స‌ల‌హ‌దారు ష‌బ్బీర్ అలీ స్పష్టం చేశారు. త్వర‌లో సీఎంతో ఇరు ప‌క్షాల‌ను స‌మావేశ పరుస్తామ‌న్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప‌టేల్ మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను వివ‌రించారు. ఆదివాసి ఏరియా అభివృద్ధిలో, శాంతిని నెల‌కొల్పడంలో మైనారిటి సోద‌రులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

 

Exit mobile version