Site icon vidhaatha

Warangal: వరంగల్ జిల్లా అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వాలు: MCPI(U) నేత‌లు

Warangal Governments neglecting district development
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్(Warangal) జిల్లా ప్రజల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలని అప్పటివరకు ఓట్లు అడిగే నైతిక హక్కు పాలక పార్టీలకు లేదని ఎంసిపిఐ(యు)(MCPI(U)) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి అన్నారు.

గత ఎన్నికల హామీలను అమలు చేయాలని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నిర్మించాలని జీవో 58 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే చలో కలెక్టరేట్ రెండు రోజుల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.

ఈ పాదయాత్ర ఈ నెల 12న నర్సంపేట పట్టణ కేంద్రంలో ప్రొఫెసర్ మరిగంటి యాదగిరి చార్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయాల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ప్రారంభిస్తారని తెలిపారు.

భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు)(MCPI(U)) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించిన కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు జిల్లా కేంద్రాన్ని సైతం నిర్మించి ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ఆచరణలో విస్మరించారన్నారు. వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి ఇంతవరకు అతీగతి లేదన్నారు. జిల్లాలో ఏ ఒక్కరికి కొత్తగా ఇంటి స్థలాలు ఇల్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవని, పారిశ్రామిక అభివృద్ధికి టెక్స్టైల్ పార్క్ ప్రారంభించినా ఇంతవరకు పురోగతీలేదని ఆరోపించారు.

వేలాది మంది పేదలు ఇంటి స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వారికి కూడా పట్టాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతూ, అంగ అర్థ బలం కలిగిన అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమ్ముకుంటురన్నారు. ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మత విభజనకు యత్నం

కేంద్ర ప్రభుత్వం సైతం జిల్లాకు చేసింది ఏమీ లేదని, ప్రచార ఆర్భాటంతో మతోన్మాద విభజనకు ప్రయత్నిస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తీరు మార్చుకోక‌పోతే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి గడ్డం నాగార్జున, సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్, అప్పనపురి నర్సయ్య, మాలి ప్రభాకర్, ఐతం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version