Site icon vidhaatha

MLC By-Election | కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌

తొలి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఆధిక్యత
తప్పని ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు?

విధాత: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు గణనీయంగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. చెల్లని ఓట్ల నిర్ధారణ ప్రక్రియతో కౌంటింగ్‌ ఆలస్యమవుతున్నది. ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. లవ్ సింబల్‌లు వేయడం జై మల్లన్న అంటూ రాయడంతో ఆ ఓట్లు పరిగణలోకి తీసుకోని పరిస్థితి ఏర్పడింది.

బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు సంబంధించి జై కేసీఆర్‌, జై కాంగ్రెస్ అంటూ మరికొందరు ఓటర్లు రాశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ వెనుక వైపుగా ప్రాధాన్యత నంబర్లు వేశారు. ఇప్పటిదాక మూడు రౌండ్లు లెక్కించగా, రెండు రౌండ్లలో లెక్కించిన 1,92,277ఓట్లలో 15,126ఓట్లు చెల్లకుండా పోయాయి. మూడో రౌండ్ లెక్కింపు కూడా పూర్తయ్యింది. అందులోనూ మల్లన్నకు భారీగా చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు మల్లన్నగెలుపు ఓటములలో కీలకంగా మారుతాయంటున్నారు.

అధిక్యతలో మల్లన్న

సుదీర్ఘంగా సాగుతున్న లెక్కింపులో ఇప్పటివరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి తన సమీప అభ్యర్థి రాకేశ్‌ రెడ్డిపై (బీఆర్‌ఎస్‌) 14,672 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తొలి రెండు రౌండ్లలో మల్లన్నకు 7,670 ఓట్లు, 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మొదటి రౌండ్‌లో మల్లన్నకు 36,210 ఓట్లు రాగా, రాకేశ్‌ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 9,109 ఓట్లు పోలయ్యాయి. ఇక మల్లన్నకు రెండో రౌండ్‌లో 34,575 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 27,573, బీజేపీకి 12,841 ఓట్లు, అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి.

మూడో రౌండ్ కౌంటింగ్ కూడా ముగిసిపోగా, మల్లన్నకు 3 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యత రాగా, మూడు రౌండ్లలో కలిపి 17వేల ఆధిక్యతలో ఉన్నారు. నాల్గవ రౌండ్ లెక్కింపుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావొచ్చు అని అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటాకు దూరంగా తీన్మార్ మల్లన్న ఉన్నట్లయితే, రెండో ప్రాధ్యానత ఓట్లను లెక్కించడం అనివార్యం కానుంది. బీఆరెస్ రెండో ప్రాధాన్యత ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది.

Exit mobile version