Site icon vidhaatha

High Court | బీఆరెస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ రేపటికి వాయిదా

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. బీఆరెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌,కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆరెస్ పార్టీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కోర్టులో వాదోపవాదాలు సాగాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలంటూ బీఆరెస్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తమ వాదనకు మద్ధతుగా వారు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు రాష్ట్రాల్లో న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను వినిపించారు.

అయితే స్పీకర్‌ను ఇన్ని రోజుల్లోగా అనర్హతకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించజాలదంటూ ఏజీ తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో తాము మరిన్ని వాదనలు వినిపిస్తామని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో కోర్టు విచారణను బుధవారంకు వాయిదా వేసింది. బుధవారంతో ఈ కేసులో వాదనలు ముగిసే అవకాశముండటంతో కోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ బీఆరెస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు హైకోర్టులో ఆ పిటిషన్లు దాఖలు చేశారు.

Exit mobile version