Uttam Kumar Reddy | కేసీఆర్ చరిత్రాత్మక తప్పిదంతోనే తెలంగాణకు ఈ దుర్గతి

తెలంగాణా ప్రాంతంలో నీటిపారుదల రంగం భ్రష్టుపట్టి పోవడమే కాకుండా ఆర్థిక సంక్షోభానికి దారి తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహ చర్యగా ఆయన అభివర్ణించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలతోటే రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఇంతటి దుర్గతి

Uttam Kumar Reddy

విధాత, హైదరాబాద్
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుకు కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందన్న దురుద్ధేశంతోనే బీఆర్ఎస్ పాలకులు మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఫలితంగా తెలంగాణా ప్రాంతంలో నీటిపారుదల రంగం భ్రష్టుపట్టి పోవడమే కాకుండా ఆర్థిక సంక్షోభానికి దారి తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహ చర్యగా ఆయన అభివర్ణించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలతోటే రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఇంతటి దుర్గతి ఏర్పడిందని ఉత్తమ్ దుయ్యబట్టారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని రాష్ట్ర నీటిపారుదల, శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీటిపారుదల రంగంపై శనివారం అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాశయాలలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను వివరించారు. జూరాల నుండి రూపకల్పన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు (పీఆర్ఎల్ఐఎస్) ను శ్రీశైలం కు మార్చడంతో పాటు తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడమే మాజీ సీఎం కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ.1.83 లక్షల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేసినప్పుటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు. పైగా ప్రాజెక్ట్ ల పేరుతో మోయలేని విధంగా 11 నుంచి 11.5 శాతం వడ్డీలతో ఇష్టానుసారంగా తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఆర్థిక భారంగా పరిణమించాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీల భారాన్ని 11.5 శాతం నుండి 7 శాతానికి కుదించి ఆర్థిక భారాన్ని కొంత మేర తగించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీల భారాన్ని తగ్గించని పక్షంలో రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి ఉండేదని ఆయన చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ను సస్యశ్యామలంగా మార్చనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంగా మార్చుకుని జరిపిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బీఆర్ఎస్ పాలనలో పాలమూరు కు ఉద్దేశ్యపూర్వకంగానే ద్రోహం తలపెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదలు రూపొందించిన ప్రకారం జూరాల నుండే కొనసాగిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం కలిగి ఉండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కానీ 2022 లో కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించినప్పుడు భూసేకరణ, కాలువల నిర్మాణం లేకుండానే రూ.32,000 వేల కోట్ల నుండి రూ.55,000 కోట్లకు అంచనా వ్యయం పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే రూ.80,000 నుండి రూ.84,000 వరకు చేరుతుందని దీనికి మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలే కారణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ నేతలు అందుకు భిన్నంగా 90 శాతం పనులు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారన్నారు. నిజానికి అంచనా వ్యయంలో కేవలం 25 నుండి 30 శాతం నిధులు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి అంటూ అబద్ధాలు ప్రచారం చేయడం ముమ్మాటికి దక్షిణ తెలంగాణా ప్రజలను మోసం చేయడమే నన్నారు. ఇప్పటికి ఆ ప్రాజెక్టుకు అవసరమైన 39 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, బీఆర్ఎస్ పాలనలో ఖర్చు చేసిన మొత్తానికి ఒనగూరిన ప్రయోజనం ఏమి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కృష్ణా నదీ జలాల అంశంపై ఆయన మాట్లాడుతూ 2016 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంద్రప్రదేశ్ కు 512 టీఎంసీ లు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కేవలం 299 టీఎంసీ లకే పరిమితం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇవే కేటాయింపులు 2020 లో కుడా కొనసాగే విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఒప్పుకున్న పాపం వారిదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పధకానికి రోజుకు మూడు నుండి నాలుగు టీఎంసీ లకు పెంచడం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు రోజుకు 4 నుండి 13 టీఎంసీ లకు పెంచడం తెలంగాణా రాష్ట్రానికి నష్టదాయకంగా మారిందన్నారు. నీళ్లు-నిధులు-నియమకాల పేరుతో ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ళ పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో ఆంద్రప్రదేశ్ ప్రదేశ్ పాలకులు అక్రమంగా నీటిని దోచుకు పోయారని అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాటి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న సన్నిహిత సంబంధాలే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటి దోపిడీకి పాల్పడడానికి ఆస్కారం ఏర్పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. వారిద్దరి మధ్యన జరిగిన సమావేశాలు కూడా ఆంద్రప్రదేశ్ కు లబ్ది చేకూర్ఛాయన్నారు. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో కుడా ఆంధ్ర ప్రాంతానికి ఇంత స్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదని ఆయన ఆధారాలతో సహా సభకు చూపించారు. తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి లెక్కలను నిగ్గు తేల్చేందుకు కొత్తగా డ్యామ్ ల వద్ద టెలిమెట్రీ పరికరాలను అమార్చేందుకు నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర విభజన జరిగాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టెలిమెట్రీ పరికరాలు అమర్చి ఉంటే నీటి దోపిడికి అడ్డు పడి ఉండేదన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లకు కేటాయించిన నీటి వాటాలను గుర్తు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014 రాష్ట్ర పునర్విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీ ల నీటి కేటాయింపులలో విభజిత ఆంద్రప్రదేశ్ కు 512 టీఎంసీ లు, తెలంగాణ 299 టీఎంసీ ల కేటాయింపు తెలంగాణా రాష్ట్రానికి బిఆర్ఎస్ ఏలుబడిలో జరిగిన చరిత్రాత్మకమైన తప్పిదంగా ఆయన అభివర్ణించారు. వాస్తవాలకు అనుగుణంగా ట్రిబ్యునల్ లో వాదనలు వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల్లో 756 టీఎంసీల నీటి వాటా కోసం పోరాటం చేస్తుందన్నారు. ఇటువంటి అననుకూల పరిస్థితిలోను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట రాష్ట్రంలో పంట దిగుబడి రికార్డు సృష్టిస్తోందని కేవలం దిగుబడి లే కాకుండా కొనుగోళ్ల ప్రక్రియ అంతే రికార్డు స్థాయిలో కొనసాగిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేసీఆర్ పాలనలో పేరు మార్చి కాళేశ్వరం పేరుతో నిర్మించడంతోనే ఇంతటి ఆర్థిక విపత్తు సంభవించిందన్నారు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ తో సహా మొత్తం మూడు బారాజ్ ల పరిస్థితి ఏమిటో అన్నది తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే నని ఆయన ఆయన విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను సద్వినియోగం చేసుకోలేక పోయిన కేసీఆర్ పాలన తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల రంగానికి మరణశాసనం రాసిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రెండు టీఎంసీ ల నుంచి మూడు టీఎంసీ లకు పెంచిన గత పాలకులు 2018 తరువాత అదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం 1.5 టీఎంసీల నుండి 1 టీఎంసీల కి తగ్గించి తమ కుటిల బుద్దిని చాటుకున్నారన్నారు. అంతే గాకుండా 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బీరాలు పలికిన బీఆర్ఎస్ పాలకులు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు. రూ.1.83 లక్షల కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేయక పోగా ప్రభుత్వం నుండి దిగి పోయేనాటికి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టగా అందులో నీటిపారుదల రంగం బిల్లులే రూ.10 వేల కోట్లు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

కేసీఆర్, హరీశ్‌లను ఉరేసినా తప్పులేదు: సీఎం రేవంత్ రెడ్డి
నయా రాజకీయం…ఎన్నికల్లో చెప్పనవి చేస్తారు!
మూసీ కారణంగా నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు

బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ జల ద్రోహులు: మంత్రి ఉత్తమ్

జలాలపై చర్చ..గాఢ నిద్రలో బీజేపీ ఎమ్మెల్యేలు

Latest News