విధాత, ప్రత్యేక ప్రతినిధి: పోగొట్టుకున్న చోటనే వెదుక్కోవాలనే గట్టి అభిప్రాయంతో రెండు జిల్లాల పై బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందోలేదో పక్కనపెడితే ఆ పార్టీ ముఖ్యనాయకులు మాత్రం తిరిగి పట్టుకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. గత కొద్దికాలంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు, శాసనసభాపక్ష ఉప నేత తన్నీరు హరీష్ రావులిద్దరూ చెరోవైపు వరుస పర్యటనలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా ఇద్దరి మధ్య నెలకొన్న పోటీయా? ఈ జిల్లాల పై తమ ఆధిపత్యం సాధించి, పట్టు కోసం చేస్తున్నారా? కారణమేదైనా రెండు జిల్లాలు ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ ల పై ఎక్కడలేని శ్రద్ధను కనబరుస్తున్నారు. ఒక నాయకుడు పర్యటన ముగించి వస్తే తెల్లారే మరో నాయకుడు అక్కడ కనిపిస్తున్నారు. రాష్ట్రంలో తమ అధికారం కోల్పోవడానికి ఈ రెండు జిల్లాల్లో పార్టీ ఓటమేకారణమని భావిస్తున్నారా? ఇక్కడ పూర్తిస్థాయి నాయకత్వం ఉన్నా సానుకూల ఫలితాలు సాధించలేనందున తిరిగి పార్టీని గాఢిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చావుదెబ్బకొట్టిన జిల్లాల్లో వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు మొదటి వరుసలో ఉన్నాయి. నల్లగొండను పక్కన పెడితే మిగిలిన రెండు జిల్లాల్లో బలమైన నాయకత్వం, నమ్మకమైన కేడర్, నాయకులున్నారనే అభిప్రాయంతో ఇక్కడ పార్టీని తిరిగి పట్టాలెక్కించి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది.
బావాబామ్మరుదుల వరుస పర్యటన
వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో బావా బామ్మరుదులు కేటీఆర్, హరీష్ రావు లిద్దరూ పోటీలుపడి పర్యటిస్తుంటారు. ఇటీవల వరంగల్ పై ఎక్కువ దృష్టిని పెడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన సర్పంచ్ లతో సమావేశాలంటూ నియోజకవర్గాలవారీగా పర్యటనలు చేశారు. తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ జిల్లాలో లేని విధంగా కేటీఆర్ రెండు రోజులు వరంగల్ జిల్లాలో మకాం వేసి మహబూబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు, భూపాలపల్లి, పరకాల మున్సిపాలిటీల్లో హెలికాప్టర్ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఏ ఒక్క మున్సిపాలిటీని గెలువలేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ముచ్చెముటలు పట్టించామనే అంచనాకు ఆ పార్టీ వచ్చింది. ఫలితాలు కాసింత నిరాశపరిచినప్పటికీ పార్టీ బలనిరూపణకు అవకాశమిచ్చిందని, ఇక్కడి నాయకత్వానికి కొంత తోడుగా నిలిస్తే తిరిగి పార్టీ పుంజుకుంటుందనే అంచనాతో ఉన్నట్లు భావిస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే జిల్లాలో ఆ పార్టీ నేత హరీష్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. హనుమకొండ, మహబూబాబాద్, పాలకుర్తి తదితర ప్రాంతాల్లో పరామర్శలు చేపట్టి, నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా దేవన్నపేటలో దేవాదుల మోటార్లను సందర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేశారు. తిరిగి రెండు రోజులకే హరీష్ రావు వరంగల్ లో పర్యటించడం తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా హెల్త్ సిటీని సందర్శించి హంగామా చేశారు. ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వం, సీఎం పై విరుచుకపడ్డారు. రెండు రోజుల గ్యాప్ తో హరీష్ రావు జిల్లాను రెండు సార్లు సందర్శించడం గమనార్హం.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ వరకూ
టీఆర్ఎస్ పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన ఆ తర్వాత కూడా జరిగిన అన్ని కీలక మూలమలుపులూ, పరిణామాల్లో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు ప్రధాన భూమిక పోషించాయి. మరో మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి నేటి వరకు ఎదురైన అన్ని ఒడిదుడుకుల్లో పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు అన్ని రకాలుగా అండదండగా నిలిచాయి. ఉద్యమకాలంలో పార్టీ నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొన్నప్పుడూ, సంక్షోభాలు తలెత్తినపుడు బాసటగా నిలిచి భరోసా నిచ్చారు. అలాంటి జిల్లాల్లో తొలిసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరపరాభవాన్ని చవిచూసింది. గతంలో ప్రత్యర్ధులకు వచ్చే స్థానాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు వచ్చి కేవలం ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. పార్టీ పట్టుతప్పి, తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతోపాటే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా అనేక కష్టనష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం ఆశించకుండా ఇక్కడి ప్రజలు పార్టీకి పూర్తి బాసటగా నిలిచినప్పటికీ ప్రధానమైన వరంగల్ నగరంతో పాటు జిల్లాలో ఆశించిన అభివృద్ధి జరుగలేదనే అభిప్రాయాలున్నాయి. పార్టీ అధిష్టానం, ముఖ్యనాయకత్వం ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరి అక్రమార్జనపరులు, తాబేదారు నేతల చేతిలో చిక్కి పార్టీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందనే చర్చ ఉంది. ఈ నేతల తీరు పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత పెరిగి ఎన్నికల్లో దాని ప్రతిబింబం ప్రతిఫలించిందని చెప్పుకుంటారు. పార్టీ అధిష్టానం కూడా జిల్లాను విస్మరించడంతో ఎన్నడూలేని విధంగా పార్టీకి గుణపాఠం చెప్పారనే అభిప్రాయం ఇప్పటికీ ఉన్నది. దాని పర్యావసానమే తాజా పంచాయతీ, మున్సిపోల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని చర్చ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి :
Weight Loss | నో జిమ్.. 11 నెలల్లో 52 కిలోలు తగ్గింది.. ఇదీ హిబా వెయిట్‌లాస్ జర్నీ
Gold, Silver Rates| బంగారం ధరలు పెరుగనున్నాయ్..!?
