Gold, Silver Rates| బంగారం ధరలు పెరుగనున్నాయ్..!?
బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 1,61,890కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100పెరిగి రూ. 1,48,400వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.500పెరిగి రూ. 2,95,000కు చేరింది.
విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 1,61,890కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 100పెరిగి రూ. 1,48,400వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.500పెరిగి రూ. 2,95,000కు చేరింది.
పెళ్లీళ్లు, శుభ కార్యాల నేపథ్యంలో భారత్ లో బంగారం, వెండి కొనుగోళ్లు అనివార్యంగా మారాయి. పెరిగిన ధరలతో సామాన్యులు కొనుగోలు శాతం తగ్గించుకుంటున్నప్పటికి…ఇన్వెస్టర్లు మాత్రం లాభార్జన కోణంతో బంగారం, వెండి ధరలపై పెట్టుబడులు కొనసాగిస్తున్నారు.
బంగారం ధర పెరిగే చాన్స్ ?
అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 5,170డాలర్లుగా ఉంది. ఆమెరికా రాజకీయ, ఆర్థిక విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య,ఇరాన్-అమెరికా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది బంగారం ధరలు పెరుగవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్(UBS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 మధ్య నాటికి బంగారం ఔన్సుకు 6,200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది 10 గ్రాములకు దాదాపు రూ. 1 లక్షా 98 వేల నుంచి రూ. 2 లక్షల స్థాయికి సమానం. రాబోయే ఆరు నెలల్లోనే బంగారం సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక,భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతాయని అంచనా వేస్తున్నారు. లాభాల స్వీకరణ తర్వాత 5,900 డాలర్ల వద్ద ఔన్స్ బంగారం ధరలు ఆగవచ్చంటున్నారు.
యూబీఎస్ అంచనా ప్రకారం.. 2025లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సుమారు 863 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లు 2026 నాటికి 950 టన్నులకు చేరవచ్చని అంచనా. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నాయి. ఈ పరిణామం బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆ సంస్థ అంచనా. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు అనుకూలంగా ఉన్నాయి.
అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక మేరకు 2025లో ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ తొలిసారిగా 5 వేల మెట్రిక్ టన్నులను దాటింది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆదాయాలు, పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా ఆభరణాల డిమాండ్ బలంగా కొనసాగుతోంది. డిమాండ్ స్థాయిలో ఉత్పత్తి, సరఫరా లేదు. ఆర్థిక నిపుణులు వుడ్ మెకెంజీ అంచనాల ప్రకారం.. 2028 నాటికి దాదాపు 80 గనులు తమ ప్రస్తుత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అంటే డిమాండ్ పెరుగుతున్నా, సరఫరా పరిమితంగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ప్రపంచ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోలు, బలమైన డిమాండ్, పరిమిత సరఫరా, వడ్డీ రేటు కోతలు వంటి పరిణామాల క్రమంలో 2026లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలలో అనిశ్చిత కొనసాగుతుందని, అయితే పారిశ్రామిక అవసరాల నేపథ్యంలో భవిష్యత్తులో పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram