KCR, Harish Rao Committed Unforgivable Crimes in Krishna Waters: CM Revanth
సారాంశం:
కృష్ణా జలాల కేటాయింపులు, పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల వ్యవహారాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఉరేసినా తప్పులేదు’, ‘రాళ్లతో కొట్టి చంపేవారు’ అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపాయి.
- కృష్ణా జలాల్లో పదేళ్ల పాలనలో వందేళ్ల తప్పులు
- మధ్యప్రాచ్చదేశాలలో రాళ్లతో కొట్టి చంపేవారు
- కసబ్లాగే వీళ్లూ లాయర్లను పెట్టుకున్నారు
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
Krishna Waters | కృష్ణా జలాల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ.హరీశ్ రావు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. “ఇంతటి భారీ ఆర్థిక మోసాలకు పాల్పడిన వారిని ఉరేసినా తప్పులేదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే చౌరస్తాలోనే రాళ్లతో కొట్టి చంపేవారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బేగంపేట మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో గురువారం నాడు నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై సాగునీటి శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం మాట్లాడారు. కృష్ణా జలాలకు సంబంధించి తమ ప్రభుత్వం నిజాలను బయటపెడుతుంటే, కేసీఆర్, హరీశ్ రావులు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నారని, ఇది అధికారికంగా రికార్డుల్లో ఉందన్నారు. అనుకున్నదానికంటే తమకు ఎక్కువ వాటా వస్తుండటంతో బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. నదీ పరీవాహకం ఆధారంగా నీటి కేటాయింపులు కోరాల్సి ఉండగా, కేసీఆర్ అలా అడగలేదని విమర్శించారు.
ముంబైపై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది కసబ్‌కు కూడా చట్టం ప్రకారం వాదించుకునే అవకాశం ఇచ్చిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని కేసీఆర్, హరీశ్ రావులు ఖరీదైన లాయర్లతో శిక్షల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రావాలని, తప్పులుంటే సూచనలు చేయాలని, అవసరమైతే సవరించుకుంటామని స్పష్టం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో నీళ్లు, నిధుల దోపిడీ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఏడు సంవత్సరాల పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీపీఆర్ లేకుండానే రూ.27 వేల కోట్లు ఖర్చు చేయడం వల్లే పర్యావరణ అనుమతులు రాలేదనీ, అయినా పనులు చేపట్టడంతో కేసులు పడ్డాయని వివరించారు.
సుప్రీంకోర్టులో సవాల్ ఎదురవడంతో ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదని, తాగునీటి కోసం 7.15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అఫిడవిట్ వేసిందన్నారు. కేవలం కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టుల కంపెనీలకు వేల కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపించారు.
జూరాల వద్ద కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే నీటిని వినియోగించుకునే అవకాశం ఉండేదని, కానీ లిఫ్టుల ద్వారా వచ్చే కమీషన్ల కోసం జూరాల వదిలి శ్రీశైలం డ్యామ్‌కు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తల అయిన జూరాలను వదిలేసి, తోక అయిన శ్రీశైలానికి వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పుతో నీళ్లు, నిధుల దోపిడీకి పూర్తి అవకాశం ఏర్పడిందన్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ (Brijesh Tribunal) 2004లో ఏర్పాటై ఇప్పటికీ తీర్పు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని కేసీఆర్ సంతకం చేయడం వల్ల ఏపీకి అలుసు అయ్యిందన్నారు. పరివాహకం ప్రకారం తెలంగాణలో 71 శాతం, ఏపీలో 29 శాతం ఉందని, అందువల్ల 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని తమ ప్రభుత్వం వాదనలు వినిపించిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని, ఇదే తరహాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.38 వేల కోట్ల నుంచి రూ.84 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లలో చేసిన తప్పులు వందేళ్లైనా సరిదిద్దలేనివిగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
