విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావును గుంట నక్కతో పోల్చి తరుచు విమర్శలు సంధిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా మరోసారి అదే పోలికతో విమర్శలు సంధించారు. ఎన్నికలకు వెళ్తున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కేవలం సిద్దిపేటకు మాత్రమే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఎలా మంజూరయ్యాయి? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి గుంట నక్కకు ఉన్న సంబంధంతోనే అక్కడ నిధులు మంజూరు అయ్యాయని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు జరుగుతాయి అని కవిత విమర్శించారు.
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు నిధులు విడుదల..సంక్షమ కేటాయింపులకు మొండిచేయి
కాంగ్రెస్ ప్రభుత్వం సంపద సృష్టించకుండా అంచనాలకు మించి అప్పులు చేస్తూ… ప్రభుత్వ ఆస్తులను అమ్మి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు అని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలపై ప్రజల దృష్టి మరల్చడానికే బూతుల పర్వంతో ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో ప్రచారం నిర్వహించారని కవిత విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకంతో రూ.7వేల కోట్లు సమీకరించుకున్నప్పటిని రెవెన్యూ లోటు మాత్రం రూ.-9వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. 1లక్ష 21వేల కోట్ల బడ్జెట్ లో కేవలం 57వేల కోట్లు ఖర్చు చేసిందని, అందుకే పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు మాత్రం 36వేల కోట్లు చెల్లింపుల లక్ష్యంలో 46వేల కోట్లు చెల్లించిన తీరు చూస్తే కమిషన్లు వచ్చే వాటికే ప్రభుత్వం నిధులు వెచ్చించి..సంక్షేమ పథకాలకు అరకొర నిధులు ఇస్తుందని తేలిపోతుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం బీసీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
హామీల అమలుకు కేటాయింపులు చేయాలి
పెన్షన్ లను డబుల్ చేస్తామన్న హామీ మేరకు 35వేల కోట్లు అధిక బడ్జెట్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు .ఇందిరమ్మ ఇళ్లకు పట్టణాల్లో రాబోయో బడ్జెట్ లో నిధులు ఇవ్వాలని, 8లక్షల ఇళ్లకు 25వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలు, ఆటో డ్రైవర్లు, కళకారులకు ఇచ్చిన హామీల మేరకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతు భరోసా పెండింగ్ నిధులు రైతుల ఖాతాల్లో ఇవ్వాలని కోరారు. రైతు రుణమాఫీ హామీ పూర్తి చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రూ.11వేల కోట్లు విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే బాకీ ఉన్న 1లక్ష 89వేల ఉద్యోగాల భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ బడ్జెట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా కేటాయింపులకే పరిమితమయ్యాయని, ఎంఐఎం పొద్దుతిరుగుడు పువ్వు వంటిదని, అధికార పార్టీలతో అంటకాగడం అలవాటుగా పెట్టుకుందని కవిత విమర్శించారు. ఓవైసీ బ్రదర్స్ కు మైనార్టీల ప్రయోజనాలకంటే సొంత ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. మైనార్టీల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం కంటే సొంత ప్రయోజనాల కోసమే ఎంఐఎం రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.
కేంద్రం లేబర్ కోడ్ మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 12న చేపట్టనున్న భారత్ బంద్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, జనగణనలో బీసీ కులగణన చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకు లేఖ రాయాలని, ఉపాధి హామీ పథకం కింద 40శాతం నిధులు రాష్ట్రం భరించాలన్న దానిపై కేంద్రాన్ని నిలదీయాలని కవిత డిమాండ్ చేశారు.
హమ్మయ్యా.. మొత్తానికి బూతు మాటలు ఆగిపోయాయి: కవిత pic.twitter.com/hCfsYdNW16
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2026
ఇవి కూడా చదవండి :
ఉద్రిక్తతలు రేపిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య
iPhone 17 Pro Max | వాలెంటైన్స్ డే ధమాకా ఆఫర్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్
