విధాత : తెలంగాణలో వాయిదా పడిన 11 మున్సిపాల్టీల చైర్మన్,వైస్ చైర్మన్ ల ఎన్నిక నేడు మంగళవారం నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లో అధికారులు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. క్యాంపులకు వెళ్లిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర అభ్యర్ధులు అంతా ఎన్నికల ప్రక్రియకు హాజరయ్యేందుకు మున్సిపల్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల సందర్బంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీం పట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్న కల్, జనగామ, తొర్రూర్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని తెలిపారు. అప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా వాయిదా పడితే రాష్ట్ర ఎన్ని కల సంఘం మరో తేదీని ప్రకటించేంత వరకు పరోక్ష ఎన్నికలు జరగవని కమిషనర్ చెప్పారు.
జనగామ, తొర్రూర్ లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీ
రాష్ట్రంలోని జనగామ, తొర్రూర్ మున్సిపాల్టీలను గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తొర్రూర్ లో మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ సంఖ్య తొమ్మిదికి పెరిగడంతో.. రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. అయితే ఎంపీ కావ్యకు ఎక్స్అఫీషియో ఓటు లేదని, గతంలో ఆమె వరంగల్ కార్పొరేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నిక సందర్బంగా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి చెరి 16 ఓట్ల బలం ఉంది. సోమవారం ప్రమాణస్వీకారానికి వస్తున్న సమయంలో 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను బీఆర్ఎస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆమె భర్త, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు తేలే వరకు ఎన్నిక వాయిదా వేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా మున్సిపాలిటీకి చేరుకొని బీఆర్ ఎస్ నుండి గెలిచానని, ఓటు బీఆర్ఎస్ కి వేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి ఎన్నిక ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ నుంచి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకుని పోరాడుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో 5 కార్పోరేషన్లు..81 మున్సిపాల్టీ చైర్మన్లు
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో ఐదింటిని ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కీలకమైన నిజామాబాద్సహా రామగుండం, మంచిర్యాల,మహబూబ్‌నగర్, నల్గొండ మేయర్ సీట్లను అధికారపార్టీ దక్కించుకున్నది. కొత్తగూడెం మేయర్ పీఠాన్ని మిత్రపక్షం సీపీఐకి వదిలేసింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలో పడింది. ఎన్నికలు ముగిసిన 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే చైర్ పర్సన్స్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు కేవలం 18 మున్సిపాలిటీలు దక్కాయి. కార్పొరేషన్లలో ఆ పార్టీ ఈసారి జీరోగా మిగిలిపోయింది. నారాయణపేట చైర్ పర్సన్ పదవిని బీజేపీ గెలుచుకున్నది.
