Pratyusha | ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు .. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు

Pratyusha | తెలుగు సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది

Pratyusha | తెలుగు సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. గతంలో సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలకు కుదిస్తూ తుది నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబర్‌లో విచారణ పూర్తయ్యాక తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం, తాజాగా న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, మన్మోహన్‌లతో కూడిన బెంచ్ ఈ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రత్యూష తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి. ఆమె అందం, నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నప్పటికీ, అతి చిన్న వయసులోనే మృతి చెందడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసుల తొలి విచారణ నుంచే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పటి రాజకీయ ప్రముఖుల కుటుంబాల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ దర్యాప్తులో సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడిగా చేర్చగా, తొలుత ఏడేళ్ల శిక్ష విధించబడింది. అనంతరం హైకోర్టు సాక్ష్యాధారాల బలహీనత కారణంగా శిక్షను రెండున్నర ఏళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దాదాపు 14 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది.

అసలు ఏం జ‌రిగింది?

ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఇంటర్ అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి అడుగుపెట్టగా, సిద్ధార్థ్ ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఇద్దరూ విషం తాగిన స్థితిలో కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న మరణించగా, సిద్ధార్థ్ రెడ్డి మార్చి 9న ప్రాణాలతో బయటపడ్డాడు. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు తేలింది. ఆర్గానోఫాస్ఫేట్ విషప్రభావమే మరణానికి కారణమని వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఆమెపై లైంగిక దాడి జరగలేదని కూడా స్పష్టం చేసింది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, హైకోర్టు దానిని రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. తర్వాత ఇరుపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిందితుడి తరఫు న్యాయవాదులు ఇద్దరూ కలిసి విషం సేవించినందున “ఆత్మహత్యకు ప్రేరేపించడం” అనే అంశం వర్తించదని వాదించినా, కోర్టు ఆ వాదనను తిరస్కరించింది.

ఈ తీర్పుతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపరమైన పోరాటానికి ముగింపు లభించినప్పటికీ, ప్రత్యూష మృతి వెనుక ఉన్న భావోద్వేగాలు, అనుమానాలు ఇప్పటికీ ఆమె అభిమానుల్లో మిగిలే ఉన్నాయి. ఈ కేసు సినీ రంగంలోనూ, న్యాయవ్యవస్థలోనూ ఒక ప్రాధాన్యమైన ఉదాహరణగా నిలిచింది.

Latest News