విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు సింగరేణి సంస్థలో సాగిస్తున్న దోపిడీని నిరోధించేందుకే , కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే కొత్తగూడెం కార్పోరేషన్ లో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా సీపీఐ పార్టీ వాళ్లు మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించారంటే ఆ పార్టీపై ఏ ఒత్తిళ్లు పని చేశాయో..వారి మీద ఎలాంటి ఒత్తిడి ఉండి, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఒప్పుకున్నారో తెలియదన్నారు. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే అక్రమాలను అడ్డుకుని తీరుతాం అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సంత్ సేవాలల్ జయంతి ఉత్సవాల్లో నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తెలంగాణ భవన్‌లో సేవలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం అన్నారు.
మా తండాలు మా పాలన సాగాలన్న నినాదంతో 3,146 తండాలను గ్రామ పంచాయితీలు చేసి..వాటిలో గిరిజనులను సర్పంచ్ లుగా, వార్డు సభ్యులుగా చేసి వారి ఆత్మగౌరవాన్ని మాజీ సీఎం కేసీఆర్ పెంచారని గుర్తు చేశారు. ఓకే రోజు నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. గిరిజన బిడ్డల కోసం వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టడం జరిగిందన్నారు. బంజారాహిల్స్ నడిబొడ్డున సేవాలాల్ బంజారా భవన్ కట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రతి జిల్లాలోనూ సేవాలాల్ భవనాలకు స్థలాలను కేటాయించామన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మా పార్టీ శ్రేణులు పోరాడుతున్నాయని, ప్రస్తుతం మా ఖాతాలో 17మున్సిపాల్టీలు ఉన్నాయని, హంగ్ లో మరిన్ని వచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, అభ్యర్థులను ఎత్తుకెళ్లడం, పార్టీలను మార్పించడం, ఎక్స్ అఫిషియో ఓట్లలో అస్పష్టత వంటి అక్రమాలతో మున్సిపాల్టీలను కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అయినప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ప్రజాతీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా లేదన్న వాస్తవం నిరూపితమైందని కేటీఆర్ పేర్కొన్నారు.
