విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..చేసిన వాగ్ధానాలు అమలు చేయడం..వాటి కోసం ప్రయత్నించడం గతంలో చూసిన రాజకీయం. రాజకీయ పార్టీలకు ఎన్నికల మ్యానిఫెస్టోలు భగవద్దీత..బైబిల్, ఖురాన్ వంటివని..అందులో చెప్పిన హామీలు అమలు చేస్తాం..మాకు అధికారం ఇవ్వడంటూ ఓటర్లను అభ్యర్థించడం ఇప్పటిదాకా చూశాం. కాని తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం అందుకు భిన్నంగా కనిపిస్తుంది.
ఎన్నికల్లో..మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చెప్పని హామీలు అమలు చేసే నయా పొలిటికల్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇందుకు తెలంగాణ ఉద్యమనేత..మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యుడు కాగా..అదే బాటలో కొనసాగుతున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి. జనం అడగని కోరికలతో పథకాలు తెచ్చి..ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేయకుండా..చెప్పని పథకాలు తేవడం తెలంగాణ రాజకీయాల్లో ఒరవడిగా మారిపోయింది. పాలకులు చెప్పిన హామీలు అమలు చేయకపోవడానికి ఆర్థిక సమస్యలు ఎంత కారణమో..చెప్పని హామీలు అమలు చేస్తుండటం వెనుక ఆర్థిక ప్రయోజనాలు అంతే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ తో మొదలైన నయా ట్రెండ్..
ఎన్నికల్లో మీరు అడగకుండానే రైతు బంధు..దళిత బంధు వంటి పథకాలు తెచ్చామని..ధరణి తీసుకొచ్చామని..కాళేశ్వరం కట్టామని..ఉద్యోగ విరమణ వయో పరిమితి పెంచామని..వేతనాలు పెంచామని మాజీ సీఎం కేసీఆర్ ఆయా వర్గాల ప్రజలకు పదేపదే చెప్పుకునే వారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన దళిత సీఎం, కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి వంటి ఎన్నో హామీలు, కుర్చి వేసుకుని మరి..పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న హామీలను మాత్రం అమలు చేయలేదు. ఎన్నికల్లో చెప్పని భూముల అమ్మకాలు, ఔటర్ టెండర్ వంటివి ఎన్నో చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఉద్యమ కాలంలో 2014, 2018ఎన్నికల సమయంలో చేసిన హామీలలో ఎన్నింటినో అమలు చేయని తీరు..ఎన్నికల్లో చెప్పని పథకాలెన్నో అమలు చేసిన వైనం..ఆయన తాలుకా రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తుంది.
రేవంత్ రెడి పాలనలోనూ అదే తీరు
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు..420హామీలు ఇచ్చి వాటిని నమ్మేందుకు ఇబ్బడిముబ్బడిగా బాండ్ పేపర్లు రాసిచ్చి మరి అధికారంలోకి వచ్చారు. ఇందులో ప్రధానంగా ఆరు గ్యారంటీల పథకాల అమలుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిలో మహిళలకు ఉచిత ఆర్టీసీ పథకం. నిజానికి ఈ హామీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ గా కాకుండా ..కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీగా మాత్రమే తెరపైకి వచ్చింది. ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కొనసాగిస్తున్నారు. ఇలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ సహాయం పెంపు, ధాన్యంకు రూ.500బోనస్ వంటి హామీలను అమలు చేస్తున్నారు.
అయితే ఆరు గ్యారంటీల్లోని కీలకమైన మహిళలకు నెలకు రూ.2,500ఆర్థిక సహాయం, రూ.4వేలు పెన్షన్ మాత్రం అటకెక్కించారు. అలాగే ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష సహా తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు, కౌలు రైతులకు రైతు భరోసా వంటి హామీల ఊసు లేదు. గత ప్రభుత్వం తమ నెత్తిపై వేసిన అప్పులు, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యలతో తాము ఆయా హామీల అమలు వాయిదా వేసుకోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ పాలకులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలే నిజమైతే కొత్త పథకాలు ఎందుకో?
అప్పులు, ఆర్థిక వనరుల కొరత సమస్యలే తమ ఎన్నికల హామీల అమలుకు అడ్డంకిగా మారాయన్నది నిజమైతే ఎన్నికల్లో ఇవ్వని హామీలు..చెప్పని కార్యక్రమాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదానిపై కాంగ్రెస్ పాలకులు జవాబు చెప్పక తప్పదు. ఎన్నికల్లో చెప్పని ఫ్యూచర్ సిటీ నిర్మాణం..కొత్త రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, పలు భవనాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు..ప్రధానంగా వందలు, వేల కోట్లతో ఖర్చుతో కూడిన కాంట్రాక్టులు, కమిషన్లతో కూడిన కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. భారీ ఖర్చులతో కూడిన అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించారు. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పేరేషన్లుగా ఏర్పాటుకు సిద్దమయ్యారు. అప్పులు, ఆర్థిక వనరుల లోటుతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి పాత హామీల అమలే గుది బండగా ఉన్నప్పుడు..ఇలాంటి కొత్త ఆలోచనలు ఎందుకన్న ప్రశ్న వినిపిస్తుంది.
పాత హామీల మాటేమిటో!
కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పిన ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి, తమ్మిడి హట్టి, డిండి ఎత్తిపోతల వంటి పెండింగ్ ప్రాజెక్టుల పనుల పూర్తి దిశగా పెద్దగా పురోగతి లేదు. పైగా ఎన్నికల్లో చెప్పని కొడంగల్ ఎత్తిపోతల పథకం కొత్తగా తెరపైకి వచ్చింది. కాళేశ్వరానికి ప్రత్యామ్నాయంగా తమ్మిడి హట్టి ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం చేపడుతామంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తరహాలోనే ఎన్నికల్లో చెప్పని హామీలను వెనక్కి నెట్టేసి..కొత్త పథకాలు..కార్యక్రమాలతో హడావుడి చేస్తుంది. కాళేశ్వరంలో లక్ష కోట్లు కుమ్మరించి కమిషన్లు కొట్టేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించిన కాంగ్రెస్ పాలకులు..ఎన్నికల్లో చెప్పని ఫ్యూచర్ సిటీ వంటివాటిని నెత్తిన పెట్టుకుని..ఇచ్చిన హామీల అమలును పడకేయించడం ఏమిటన్న ప్రశ్నను ఎదుర్కొనక తప్పదు.
రిటైర్డు ఉద్యోగుల బకాయిలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్..గురుకులాలకు భవనాలు వసతుల కల్పనకు నిధులు ఇవ్వడంలో తంటాలు పడుతున్న ప్రభుత్వం మ్యానిఫెస్టోలో లేని కొత్త కార్యక్రమాలతో మరిన్ని ఆర్థిక కష్టాలు ఎందుకు తెచ్చుపెట్టుకుంటుందన్న వాదన వినిపిస్తుంది.
అడగని ఫ్రీ టోల్ ఆంద్రోళ్లకేనా…? మేడారం భక్తులకు ఇస్తారా!
తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని రాజేసుకుని సెల్ఫ్ గోల్ కు తెరలేపింది. సంక్రాంతికి జంటనగరాల నుంచి ఏపీకి వెళ్లే ప్రజల కోసం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలో టోల్ చార్జీలు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం అనుమతించకపోతే ఆ టోల్ చార్జీల మొత్తాన్ని మేం చెల్లిస్తామంటుంది. ఇక్కడే సరికొత్త వివాదానికి బీజం పడింది. కేవలం ఆంధ్రకు వెళ్లే ప్రయాణికులకు టోల్ ఫ్రీ ప్రకటించి తెలంగాణలోని ఇతర జాతీయ రహదారుల మీదుగా తమ సొంత జిల్లాలకు వెళ్లే ప్రజలకు టోల్ ఫ్రీ ఎందుకు కేంద్రాన్ని అడగలేదన్న వాదన స్వరాష్ట్ర ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలంగా ఎదురవుతుంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టోల్ ఫ్రీ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెరపైకి రావడం సర్కార్ కు మరింత సంకటంగా మారింది. తాజాగా రెండు మూడురోజుల్లోనే మేడారానికి లక్ష మంది భక్తులు తరలివెళ్లడం గమనార్హం. అసలు ఎవరూ అడగని ఉచిత బస్సు పథకం మాదిరిగా ఈ టోల్ ఫ్రీ గొడవ ఎందుకు ఎత్తుకున్నారన్నంటూ సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడిగా ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నీళ్లు తరలించుకపోతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ ప్రయాణికులకు టోల్ ఫ్రీ అంశం తెరపైకి తెచ్చి..సొంత రాష్ట్ర ప్రజల టోల్ ఫ్రీ అంశాన్ని విస్మరించిన తీరు మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్ తేనెతుట్టెను కదిపినట్లుగా ఉందంటున్నారు. ప్రభుత్వానికి స్వరాష్ట్ర ప్రజలపైన ప్రేమ ఉంటే..వివక్షతను వదిలి రాజీవ్ రహదారి, వరంగల్, రామగుండం, ఖమ్మం, నిర్మల్, కొత్తకోట మార్గాల్లో పండుగ సెలవుల్ల ప్రయాణించే తెలంగాణ వాహనదారులకు, మేడారం భక్తులకు కూడా టోల్ ఫ్రీ అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది.
ఇవి కూడా చదవండి :
Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ
Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. కల్కి 2పై క్రేజీ అప్‌డేట్..!
