విధాత, హైదరాబాద్:
Kothagudem Corporation | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పున ఒక మంత్రి వ్యూహాత్మకంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి అండగా ఉంటున్న సీపీఐ పార్టీని దూరం చేసే పనిలో పడ్డారా? అందివచ్చిన అవకాశాన్ని వదలకుండా కుట్రలకు తెరలేపుతూ తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? హంగ్ ఏర్పడి.. కాంగ్రెస్, సీపీఐ రెండున్నరేళ్ల సర్దుబాటు నేపథ్యంలో మరోసారి ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
2023లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ కోసం సర్వశక్తులు ఆయన విఫల యత్నం చేసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఆ సీటును మిత్రపక్షం సీపీఐకి కేటాయించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీకి దిగారని అంటున్నారు. అయితే తాజాగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పేరుతో తొలుత నాటకమాడి ఇబ్బందులకు గురి చేయడంతో సీపీఐ స్వంతంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో సమానంగా 22 సీట్లను గెలుపొందింది. మేయర్ సీటు వాళ్లకు ఇవ్వకుండా పేచి పెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేయడంతో తాత్కాలికంగా సద్దుమణింది. వచ్చే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మంత్రి ఇంకా ఎన్ని తలనొప్పులు తెస్తారోనని స్థానిక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ సీటు పై కన్నేసిన ఆయన పార్టీ పెద్దలను కాదని కక్షపూరితంగా వ్యవహరిస్తూ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కాంగ్రెస్, సీపీఐ మధ్య తొలుత చర్చలు జరిగాయి. బలం ఉన్న చోట సంబంధిత పార్టీలు పోటీ చేయాలని, బలం లేని చోట బలమైన వ్యక్తులను నిలబెట్టాలని అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తమకు 25 డివిజన్లు కేటాయించాలని తొలుత సీపీఐ డిమాండ్ చేసింది. అన్ని డివిజన్లు ఇవ్వలేమని, 18తో సరిపెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించారని సమాచారం. మరో రెండు పెంచాలని గట్టిగా కోరినప్పటికీ కాంగ్రెస్ నేతలు విన్పించుకోలేదని తెలిసింది. డబ్బు అహంకారం ఉన్న మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నదని సీపీఐ నాయకులు గమనించారు. పొత్తులను చెడగొట్టేందుకే మంత్రి ఈ పన్నాగం పన్నారని, అడిగిన రెండు డివిజన్లు అదనంగా ఇవ్వకుండా అడ్డుపడ్డారని అక్కడి కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. వారితో పొత్తులు చెడగొట్టి స్వతంత్రంగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే డివిజన్ల సంఖ్యను తగ్గించారనే చర్చలు మొదట్లలో వినిపించాయి. మంత్రి మోసం చేస్తున్నాడని గ్రహించిన సీపీఐ నాయకులు ఒంటరిగా బరిలోకి దిగినట్టు చెబుతున్నారు.
22 డివిజన్లలో సీపీఐ తన అభ్యర్థులను గెలిపించుకున్నది. అధికార కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, బీజీపీ ఒకటి, స్వతంత్రులు ఆరు డివిజన్లలో విజయం సాధించారు. ఫలితాల తరువాత ఎర్రజెండాకు పదింట్లో గెలవదని ప్రచారం చేసిన కాంగ్రెస్ కు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని సీపీఐ నాయకులు వ్యాఖ్యానించారు. మిత్ర ద్రోహానికి పాల్పడినందుకు సరైన తీర్పు చెప్పారని కాంగ్రెస్ లోనే ఒక వర్గం భావిస్తున్నది. టికెట్ల కేటాయింపులో ఒక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా పరాజయానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెంలో సీపీఐ ఊసు లేకుండా చేయాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ ప్రజల తమ ఓటుతో తగిన శాస్తి చేశారంటున్నారు. టీడీపీ కూడా మద్ధతు పలుకడంతో సీపీఐ అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది.
బీఆర్ఎస్ మద్ధతుతో సీపీఐ ఓటమికి పన్నాగాలు
కొన్ని చోట్ల సీపీఐ అభ్యర్థులను ఓడించేందుకు మంత్రి ఆదేశం మేరకు బీఆర్ఎస్ అభ్యర్థులతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రి డబ్బులు ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో స్వల్ప ఓట్ల తేడాతో ఐదారుగురు సీపీఐ అభ్యర్థులు ఓడిపోయారు. కాంగ్రెస్ 58 డివిజన్లలో పోటీ చేయగా 22, బీఆర్ఎస్ 60 డివిజన్లలో పోటీ చేయగా 8 డివిజన్లలో విజయకేతనం ఎగుర వేసింది. ఫలితాల తరువాత అప్పటి వరకు మౌనంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పరిస్థితి చేయిజారే ప్రమాదముందని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని, సాంబశివరావుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి, చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారని సమాచారం. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహ చర్చలు జరిపారు. చెరో రెండున్నర సంవత్సరాలు మేయర్ పదవిని పంచుకోవాలని నిర్ణయించడంతో ఇప్పటికీ మాత్రం సమస్య సద్దుమణిగింది.
ముందస్తు వ్యూహంతో తుమ్మలకు కరీంనగర్ బాధ్యతలు
కొత్తగూడెంపై తన పట్టును మరింత పెంచుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి… సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించేలా పార్టీ నుంచి ఆదేశాలు జారీ చేయించారని చర్చించుకుంటున్నారు. ఆయన లేకుంటే తన కుట్రలు, కుతంత్రాలకు అడ్డు చెప్పేవారు ఉండరనే ఉద్ధేశ్యంతోనే కరీంనగర్ కు పంపించారంటున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లాలో ఉన్నట్లయితే సీపీఐతో పేచీ వచ్చేది కాదని, కలిసి పోటీ చేసి కొత్తగూడెంలో బీఆర్ఎస్ ను మట్టి కరిపించేవారని కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ సీటును 2028లో ఎలాగైనా దక్కించుకునేందుకు మంత్రి ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ లో ఒక వర్గం ప్రచారం చేస్తున్నది. గెలిచిన స్వతంత్రుల్లో ఐదుగురిని కాంగ్రెస్ లో చేర్చుకుని పరోక్షంగా సీపీఐని రెచ్చగొడుతున్నారనే వాదనలు కూడా నియోజకవర్గంలో జరుగుతున్నాయి.
ఇలాగైతే 2028లో సీపీఐతో పొత్తులు ఉంటాయా?
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి దూకుడు, ఒంటెత్తు పోకడల కారణంగా సీపీఐతో మిత్రబంధం వికటించే ప్రమాదంలో ఉందని గాంధీ భవన్ కు చెందిన ఒక నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన వైఖరి కారణంగానే సీపీఎం దూరం అయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న సీపీఐని దూరం చేసే పనిలో మంత్రి నిమగ్నమయ్యారని, ఇప్పటికైనా పీసీసీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలని కోరతున్నారు. సదరు మంత్రిని ఇలాగే వదిలేస్తే పార్టీ తన చేతుల్లో ఉందంటూ చెలరేగే ప్రమాదముందని మరో నాయకుడు వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో తీవ్ర అవమానాలకు గురైన సీపీఐ నాయకత్వం కాంగ్రెస్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నదని, ఈ పార్టీని కూడా వదులుకుంటే వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతుందని మరో కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సదరు మంత్రికి ఎదురుగాలి వీస్తున్నదని, అందుకే కొత్తగూడెంలో మాటామాటికి వేలు పెడుతూ స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావును ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీపీఐ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రిని ఇలాగే వదిలేస్తే 2028లో సీపీఐ పార్టీ దూరం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కమ్యూనిస్టు నేతలు చర్చించుకుంటున్నారు.
