ఫ్యూచర్ సిటీపై ఉన్న ధ్యాస.. హెల్త్ సిటీపై లేదు : హరీష్ రావు

హెల్త్ సిటీపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని హరీష్ రావు విమర్శించారు. పూర్తి సిబ్బంది లేకుండా ఆసుపత్రి ప్రారంభిస్తే నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు

Harish Rao

విధాత, ప్రత్యేక ప్రతినిధి: రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ హెల్త్ సిటీ మీద లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టిందన్నారు. కనీసం సిబ్బంది లేకుండా జూన్ 2న హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? ‘ఓపీ సేవలు’ ప్రారంభిస్తాం అని రాశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? అంటూ ప్రశ్నించారు. అన్ని హంగులతో హాస్పిటల్ ప్రారంభించకుంటే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామంటూ ప్రకటించారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలతో కలిసి సోమవారం హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా? ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారిందన్నారు. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదని ప్రశ్నించారు. మంత్రులు దేవాదుల ప్రాజెక్టు వారికి చివరి ప్రాధాన్యతగా మారిందన్నారు. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాజయ్య, నాయకులు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Tippiri Thirupathi | రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తా: మావోయిస్టు నేత దేవ్ జీ
రూ.127 కోట్ల సైబర్ మోసం బద్దలు.. 16 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెగా ‘ఆపరేషన్’

Latest News