Revanth Reddy : మూసీ కారణంగా నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు

మూసీ కాలుష్యంతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలతో శాశ్వత పరిష్కారం చూపుతామని అసెంబ్లీలో తెలిపారు.

Revanth Reddy

విధాత, హైదరాబాద్: మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారు. 1908 లో నగరాన్ని వరద ముంచెత్తితే… వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌజుల డ్రైనేజీలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో కలుపుతుంటే ఉక్కు పాదం మోపామన్నారు.

ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయి. లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించామన్నారు. ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకుని మూసీ ప్రక్షాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయన్నారు. మూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెప్పిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 20 TMC లలో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలనుకుంటున్నామన్నారు.

గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారు, ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారు అయినా మేం వాటిని వ్యతిరేకించలేదు… తప్పుపట్టడం లేదని సీఎం అన్నారు.

మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట V షేప్ లో అభివృద్ధి జరుగుతోంది. మూడు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేయబోతున్నామని, మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.

ADB బ్యాంకు రూ. 4 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది, గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామన్నారు. ఓల్డ్ సిటీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు, ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ.. ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కొంతమంది నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీనే అని అన్నారు.

హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారు, రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతున్నది. రాబోయే 20 ఏండ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుందని సీఎం అన్నారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమైనదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. నిజాలు ప్రజలకు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారన్నారు.

మూసీ ప్రక్షాళన చేయాలని వాళ్ల బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు, మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. మంచిరేవుల దగ్గర మూసీ పరివాహకంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. మూసీ పరివాహకంలో గురుద్వార్ , మసీదు, చర్చి లను నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నామన్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచనప్రాయంగా అంగీకరించారన్నారు.

హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం, మేం మంచి పని చేయాలనుకుంటున్నాం… మీ సూచనలు సలహాలు ఇవ్వండని గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను సీఎం కోరారు. మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి, పేదలకు మంచి ఇండ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దామని గ్రేటర్ ఎమ్మెల్యేలకు సూచించారు. డీపీఆర్ సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటామని తెలిపారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి :

MSG | సంక్రాంతికి మెగాస్టార్ సందడి .. ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్‌తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్
Durgam Cheruvu | దుర్గం చెరువు కబ్జా జరిగిందిలా : బయటపెట్టిన హైడ్రా

Latest News