Telangana Republic Day celebrations| రాజ్యాంగం మార్గదర్శకత్వంలో తెలంగాణ రైజింగ్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

భారత రాజ్యాంగం మార్గదర్శకత్వంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ - 2047 లక్ష్య సాధన దిశగా పురోగమిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు.

విధాత, హైదరాబాద్ : భారత రాజ్యాంగం మార్గదర్శకత్వంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ – 2047 లక్ష్య సాధన దిశగా పురోగమిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ.. గత రెండేళ్ల‌లో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగంలో విశేష పురోగతిని సాధించిందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం 2047నాటికి 30ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని..ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌-2047ను ఆవిష్కరించిందని, హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచేలా రూపొందించిన ఈ డాక్యుమెంట్ రాష్ట్ర అభివృద్దిలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలిపారు.

మూడు జోన్లుగా తెలంగాణ అభివృద్ది

రాష్ట్ర సమతుల్య అభివృద్ది సాధనకు మూడు ఆర్థిక మండలాలుగా తెలంగాణను విభజించి.హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గవర్నర్ తెలిపారు. CURE – కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ లో భాగంగా హైదరాబాద్‌ను అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యం. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, కాలుష్యాన్ని తగ్గిస్తూ హైద‌రాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దునున్నట్లుగా తెలిపారు. PURE – పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య గ‌ల ప్రాంతాన్ని తయారీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయడమే ల‌క్ష్యంగా పేర్కొన్నారు. RARE – రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్‌కు బయట ఉన్న రాష్ట్రంలోని ఇత‌ర గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్ట‌డం జ‌రుగుతుందన్నారు.

జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్

హైదరాబాద్ దేశంలోని జీసీసీలకు కేంద్రంగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్‌ తెలంగాణ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ప్ర‌పంచానికి చాటిందని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ డాకుమెంట్ ద్వారా 2047 సంవ‌త్స‌రం నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించింది అని వివరించారు. తెలంగాణ లైఫ్ సైస్సెస్‌ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగింది. ఇక్క‌డ 2,000కు పైగా ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉన్నాయి. దావోస్ వేదిక‌గా నెక్స్ట్ జెనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ను ప్రారంభించింది. 2030 నాటికి టాప్-3 గ్లోబల్ క్లస్టర్లలో చేరడమే ప్ర‌భుత్వ లక్ష్యం. క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు ప్రణాళికలు

తెలంగాణ రైజింగ్–2047 ప్రణాళిక ద్వారా గాంధీ సరోవర్ ప్రాజెక్టు(బాపూఘాట్), గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, రెండో దశ మెట్రో రైలు, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ల‌ను నిర్మించనున్నట్లుగా గవర్నర్ తెలిపారు. ఇవన్నీ 2047 నాటికి తెలంగాణను దేశ పురోగతిలో కీలక పాత్రధారిగా నిలబెడతాయి అన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలు, సంక్షేమం పరిరక్షణ

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను క‌న‌బ‌రుస్తోంది అని గవర్నర్ తెలిపారుప. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటూ, 2025లో జిల్లా కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించ‌డం జ‌రిగింది. అంధెశ్రీ ర‌చించిన‌ “జయ జయ హే తెలంగాణ”ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించ‌డం జ‌రిగింది అని గుర్తు చేశారు.

గిరిజన గ్రామమైన మేడారంలో రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం జ‌రిగింది. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు శాశ్వత మౌలిక వసతుల కోసం రూ.251 కోట్లను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఈ జాత‌ర‌కు రెండు కోట్లకుపైగా భక్తులు హాజరవుతారని అంచనా. బతుకమ్మ వేడుకలకు గిన్నీస్ వరల్డ్ రికార్డు దక్కిందని వివరించారు.

రికార్డు స్తాయిలో ధాన్యం ఉత్పత్తి

రైతుల‌ సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌మిస్తోంది. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం ద్వారా రూ.20,617 కోట్ల వ్యయంతో సుమారు 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని గవర్నర్ వివరించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి అందించే సహాయాన్ని గత సంవత్సరం రూ.10,000 నుంచి రూ.12,000కు పెంచి సాగు పెట్టుబడిని అందిస్తోంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సన్న ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 14.24 లక్షల మంది రైతుల నుంచి సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జ‌రిగింది. ఇప్పటివరకు రూ.17,079.50 కోట్ల చెల్లింపులు జరిగాయి. అదనంగా రూ.1,453 కోట్లను బోనస్ సబ్సిడీగా పంపిణీ చేశారు అని తెలిపారు.

బలమైన వ్యవసాయ మౌలిక వసతుల కారణంగా తెలంగాణ దేశంలోనే వ‌రి ఉత్ప‌త్తిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యంను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన ఉనికిని చాటింది. రైతుల ఆర్థికాభివృద్ధికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతలు, మట్టిసార నిర్వహణ, సేంద్రీయ‌ వ్యవసాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు లక్ష్యంగా ఫార్మర్ కమిషన్‌ను తొలిసారిగా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉత్పాదకత పెరిగి, రుణ బాధలు తగ్గనున్నాయి.

రైతులకు అనుకూలంగా భూ భారతి

సమస్యలతో నిండిన ధరణి పోర్టల్ స్థానంలో రైతులకు అనుకూలమైన భూభారతి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగిందని, దీని ద్వారా దీర్ఘకాలిక భూవివాదాలకు పరిష్కారం లభించనుందని గవర్నర్ తెలిపారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025లో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానం పొందింది అని గుర్తు చేశారు.

రెండేళ్లలో 62,479ఉద్యోగాల కల్పన

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-I, II, III, IV నియామకాలను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర సంస్థల ద్వారా 62,749 మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లుగా గవర్నర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET)ను ప్రారంభించారు. ఇది ఇలాంటి ఆర్థిక భారం ప‌డ‌కుండా యువతకు ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు 1,22,337 మంది ఉద్యోగార్థులు నమోదు కాగా, 1,892 వివిధ కంపెనీల యజమానులు ఇందులో చేరారు. యువతకు ఉపాధి నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం స్థాపించింది. పాఠశాల, ఉన్నత విద్య రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టింది. ఫ్యూచ‌ర్ సిటీలో సమగ్ర క్రీడా కేంద్రంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ శిక్షణ, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాల క‌ల్ప‌న‌తో తెలంగాణను గ్లోబల్ స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

విద్యరంగం బలోపేతానికి చర్యలు

రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని నమ్మిన ప్రభుత్వం… ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేట్ సంస్థలతో సమానంగా పోటీ పడేలా అనేక చర్యలు చేపట్టిందని గవర్నర్ వెల్లడించారు. సమర్థ‌మైన‌ విద్యా విధానాల రూపకల్పన కోసం ఎడ్యుకేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యాల కోసం మెస్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకుగాను 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించింది.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరా మహిళా శక్తి కమిషన్

మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని..కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా రూ.40,000 కోట్ల బ్యాంకు అనుసంధానం కల్పించింది. స్వయం సహాయక సంఘాలు 236 ఇందిరా మహిళా శక్తి కాంటీన్లు, నారాయణపేట, సంగారెడ్డిల‌లో రెండు పెట్రోల్ బంకులను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచాయి. హైటెక్ సిటీ సమీపంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి, మహిళ‌ల‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే ఓపెన్ నెట్‌వ‌ర్క్ డిజిట‌ల్ కామ‌ర్స్(ONDC) ప్లాట్‌ఫార‌మ్స్‌ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేయిస్తోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి మ‌హిళా సంక్షేమం నిబద్ధతను చాటింది. స్వ‌యం స‌హాయ‌క గ్రూపు మహిళలను బస్సుల యజమానులుగా మార్చి ఆర్టీసీకి బ‌స్సుల‌ను లీజుకు ఇచ్చేలా చేసింది. ఇప్పటివరకు మహిళలు 267 కోట్ల ప్రయాణాలు చేసి, సుమారు రూ.9,105 కోట్లను ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందిస్తూ 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. ఇప్పటివరకు రూ.753 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. గృహ జ్యోతి పథకం ద్వారా 53 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తూ రూ.3,593 కోట్ల సబ్సిడీ ఇచ్చింది.

ప్రజారోగ్యానికి ప్రాధానత్య

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అధిక‌ ప్రాధాన్యమిస్తోంది అని, గత 100 ఏళ్లుగా పేదలకు వైద్య సేవల దేవాలయంగా ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం రూ.2,700 కోట్ల వ్యయంతో 27 ఎకరాల్లో అత్యాధునిక కొత్త ఆసుపత్రిని నిర్మిస్తోందని గవర్నర్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో రూ.16,521 కోట్లు ఖర్చు చేసింది అని తెలిపారు.

సామాజిక న్యాయానికి పెద్దపీట

సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల, ఉద్యోగ సర్వేను విజయవంతంగా నిర్వహించిందని గవర్నర్ తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా ప్ర‌క‌టించి, నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. దేశంలోనే పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 1.03 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా 3.34 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రతి నెలా 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. పాఠశాలలు, హాస్టళ్లకు 6,500 మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తూ 39 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తోంది. 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం అందిస్తోంది అని వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు.ఎన్నికైన 12,702 మంది సర్పంచులకు శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు.

పేదలకు 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల గృహ స్వప్నాన్ని నెరవేరుస్తోంది అని, ఇళ్లనుమహిళల పేర్లతోనే మంజూరు చేసి సామాజిక, ఆర్థిక సాధికారతను కల్పిస్తోంది అని గవర్నర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున‌ మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. చెంచు గిరిజనులకు 10,000 ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేసింది. చేనేత రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,700 మంది చేనేత మ‌గ్గాలు, 43,770 పవర్ లూమ్స్ ఉన్నాయి. నేతన్న బీమా పథకం కింద కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించ‌డం జ‌రుగుతుంది అని వెల్లడించారు.

మున్సిపాల్టీల అభివృద్దికి.. మూసీ ప్రక్షాళనకు చర్యలు

సమగ్ర పట్టణాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి 27 మున్సిపాలిటీలను విలీనం చేయ‌డం జ‌రిగింది అని, 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించ‌డం జ‌రిగింది అని గవర్నర్ వివరించారు. మూడు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి భద్రతను మ‌రింత పెంచ‌డం జ‌రిగింది. కాలుష్య నియంత్రణ కోసం ఈవీలకు 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నారు. హెచ్‌ఐఎల్‌టీ విధానంతో కాలుష్య పరిశ్రమలను నగ‌రం బయటకు తరలించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. ముచ్చ‌ర్ల‌, కందుకూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. మూసీ నది పునరుజ్జీవనానికి 55 కి.మీ. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. చెరువుల ఆక్రమణల నివారణకు హైడ్రాను తీసుకువచ్చారు. అంబర్‌పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించారు. హ్యామ్ మోడల్‌లో 12,000 కి.మీ రహదారుల అభివృద్ధికి రూ.11,399 కోట్లను మంజూరు చేశారు. గ్రామీణ రహదారులకు రూ.16,007 కోట్లను ప్రతిపాదించినట్లుగా తెలిపారు.

Latest News