CM Revanth Reddy | త్వరలోనే కాలేజీ విద్యార్థినులకు స్కూటర్లు : సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు స్కూటర్లు అందజేస్తామని ప్రకటించారు.

cm revanth reddy international women's day celebrations hyderabad

CM Revanth Reddy | దేశంలో ఇంకా వివ‌క్ష ఉందని.. మ‌హిళ‌లు, పురుషులు, కులాలు మ‌ధ్య వివ‌క్ష కొనసాగుతున్నదని సీఎం అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా వివ‌క్ష ఉంది.. కాని అక్క‌డ క‌ష్ట‌ప‌డే వారికి గుర్తింపు ఉందని చెప్పారు. మ‌న దేశంలో కూడా క‌ష్ట‌ప‌డే వారికి గుర్తింపు ఇవ్వాలి..అవ‌కాశాలు క‌ల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మహిళలకు సరైన గుర్తింపునివ్వాలని కలెక్టర్లు, ఎస్పీలుగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళా అధికారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమైన శాఖలకు మ‌హిళ‌లు బాధ్య‌త వ‌హిస్తున్నారని చెప్పారు. హైద‌రాబాద్ లాంటి కీల‌క జిల్లాకు క‌లెక్ట‌ర్ మ‌హిళ ఉన్నారని సీఎం తెలిపారు. ఎస్ఐబీలో మ‌హిళా అధికారి 700 మంది మ‌వోయిస్టులు స‌రెండ‌ర్ అయ్యేలా కృషి చేశారని వెల్లడించారు. అవకాశం ఇచ్చినప్పుడే మహిళల్లోని సమర్థత బయటకు వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళలకు అవకాశాలు ఇస్తుందని, సద్వినియోగం చేసుకున్నారు ఉన్నత శిఖరాలకు చేరుతారని అన్నారు. త్వ‌ర‌లో కాలేజీ విద్యార్థినుల‌కు ఈవీ స్కూటీలు అందించ‌బోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు స‌రైన గుర్తింపు లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల్లోని నైపుణ్యాల‌ను గుర్తించి ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త సంస్థ‌ల‌పైన ఉందన్నారు.

గతంలో రాష్ట్ర‌ప‌తి , ప్ర‌ధాని, లోక్‌సభ స్పీక‌ర్, ముఖ్య‌మంత్రులు, పార్టీ అధ్య‌క్షులుగా దేశంలో అన్ని ప‌ద‌వులను కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిందే ఉక్కు మహిళ సోనియా గాంధీ స్ఫూర్తితోనని చెప్పారు.

రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం కల్పించామని సీఎం తెలిపారు. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా 1000 బ‌స్సుల‌కు య‌జ‌మానుల‌ను చేశామని చెప్పారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళల‌ను 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల య‌జ‌మానుల‌ను చేశామని, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల విక్ర‌యం కోసం అమెజాన్ తో ప్ర‌భుత్వం ఒప్పందం చేయించిందని తెలిపారు. మ‌హిళ‌లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండ‌గా ఉండ‌టం కోసం హైటెక్ సిటీ ప‌క్క‌నే 1000 కోట్ల విలువైన మూడున్న‌ర ఎక‌రాల స్థలంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్థానిక టాలెంట్‌ను గ్లోబ‌ల్ టాలెంట్ గా మార్చ‌డం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. మ‌హిళ‌ల ఆర్థిక శ‌క్తి పెర‌గ‌డం వ‌ల్లనే అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయన్నారు. తన రాజకీయ ప్ర‌యాణంలో అనేక మంది జ‌ర్న‌లిస్టులు ,మ‌హిళా జ‌ర్న‌లిస్టులు తన శ్రేయోభిలాషులుగా ఉన్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. మహిళ‌ల మాట‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త ఎక్కువగా ఉంటుందన్నారు.

2047 నాటికి ట్రిలియ‌న్ ఎకాన‌మీ గా తెలంగాణ ను తీర్చిదిద్దాల‌ని భావిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికి అనేక అవ‌కాశాలున్నాయన్నారు. 200 బిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీగా ఉన్న రాష్ట్రాన్ని 8 యేళ్ల‌లో 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ గా మార్చ‌డం కోసం ప‌నిచేస్తున్నామని వివరించారు. గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను ఏర్పాటు చేసి అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను ఆహ్వానించామని తెలిపారు. 1.30 కోటి జ‌నాభా ఉన్న కోర్ ప్రాంతాన్ని స‌ర్వీస్ సెక్ట‌ర్ గా మారుస్తామని ప్రకటించారు.

దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ

‘పొలిటిక‌ల్ క్యాపిట‌ల్ ఢిల్లీ వాయు కాలుష్యం వ‌ల్ల ఇబ్బందిప‌డుతోంది.. ముంబ‌యి కూడా అనేక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతోంది.. చైన్నైలో వ‌ర‌ద‌ల స‌మ‌స్య ఉంది.. దేశంలోనే బెస్ట్ సిటీ హైద‌రాబాద్’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్ర‌బాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దాని చెప్పారు. సౌత్ కొరియా, న్యూయార్క్ ,టోక్యో తో హైద‌రాబాద్ పోటీ ప‌డేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

రెడ్, అరెంజ్ క్యాట‌గిరి ప‌రిశ్ర‌మ‌ల‌ను అవుట‌ర్ రింగ్ రోడ్డు బ‌య‌ట‌కు పంపిస్తామని సీఎం చెప్పారు. హైద‌రాబాద్ లో 2500 ఆర్టీసీ డీజీల్ బ‌స్సులు నిత్యం కాలుష్యం వెద‌జిల్లుతున్నాయి.. డిసెంబ‌ర్ లోప‌ల వాటిని జిల్లాల‌కు త‌ర‌లించి ఈవీ బ‌స్సుల‌ను తేబోతున్నామని తెలిపారు. ఈవీ వెహికిల్ కు జీరో ట్యాక్స్ అమ‌లు చేస్తున్నామన్నారు. ‘అంత‌ర్జాతీయ స్థాయికి న‌గ‌రాన్ని తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంది. హైద‌రాబాద్ ఇప్పుడు ఆరెంజ్ కేట‌గిరిలో ఉంది.. ఇలాగే వ‌దిలేస్తే రెడ్ జోన్ లోకి వెళ్తుంది’ అని హెచ్చరించారు.

‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, 10 వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ధి మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’ అనిసీఎం తెలిపారు.

జ‌ర్న‌లిస్టుల ముసుగులో కొంద‌రు చేసే ప‌నుల‌ను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఫీల్డ్ జ‌ర్న‌లిస్టుల‌కు, డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు తేడా లేదని చెప్పారు. ‘జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పైన త్వ‌ర‌లోనే మంచి వార్త చెపుతా.. చ‌ట్టం వ‌ల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థ‌లాల‌పైన నిర్ణ‌యం తీసుకుంటాం.. ప్యూచ‌ర్ సీటీలో జ‌ర్న‌లిస్టుల‌కు మంచి కాల‌నీని డిజైన్ చేద్దాం’ అని ప్రకటించారు.

ప్రపంచంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను ప్రస్తావించిన సీఎం.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో యంగ్ ఇండియా అనే ప‌త్రిక‌ను మ‌హాత్మాగాంధీ పత్రిక‌ను న‌డిపించారని, నెహ్రు దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు విధానాల కోసం నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను న‌డిపించారని, సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి గోల్కొండ ప‌త్రిక‌ను న‌డిపించారని చెప్పారు. గొప్ప పోరాట‌ల‌ను ప‌త్రిక‌ల ద్వారా నడిపించ‌డం ద్వారా శాంతియుతంగా యుద్ధాన్ని గెల‌వ‌వ‌చ్చున‌ని నిరూపించారని అన్నారు. ఆయుధాలతో కూడిన యుద్ధం విషాదంతో ముగుస్తుందని చెప్పారు. సిద్ధాంత‌ప‌ర‌మైన యుద్ధం చేస్తే దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చుకోవ‌చ్చున‌ని మ‌హాత్మాగాంధీ నిరూపించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Latest News