International Women’s day | ఫాసిజం నేపథ్యంలో స్త్రీ విమోచనోద్యమం పై 105 ఏండ్ల క్రితం లెనిన్ దిశా నిర్దేశం నేటికీ మార్గదర్శకమే!

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు. దీని వెనుక సాగిన పోరాటాలు, చేసిన త్యాగాలు.. ఎన్నో

international women's day history - ai creation

International Women’s day | నేడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అది 1908 లో శ్రామిక మహిళల పోరాటంతో ఉద్భవించింది. నాటి రాజకీయ అనుబంధం ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగింది. తొమ్మిదేండ్ల తర్వాత 1917 లో జారు సర్కార్ కి వ్యతిరేకంగా పెట్రోగ్రాడ్ శ్రామిక బస్తీ మహిళల తీవ్ర విప్లవ కార్యాచరణ రష్యా విప్లవ చరిత్ర గమనాన్ని మలుపు త్రిప్పింది. అది అంతర్జాతీయ మహిళా దినానికి ప్రాసంగికతను తెచ్చింది. దానితో కూడా ఆ అనుబంధం ఆగలేదు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం రాజకీయ జీవం పోసి మహిళా ఉద్యమానికి కొత్త విప్లవ శక్తిని అందించింది. రాజకీయ దిశానిర్దేశం చేసి నడిపించింది.

ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో ఇటలీ కేంద్రంగా మొదటిసారి ఫాసిజం ఒక ప్రమాదకర శక్తిగా ముంచుకొచ్చింది. ఆ సంక్లిష్ట కాలంలో అదొక కొత్త రూపం ధరించింది. అది లెనిన్ సారథ్యంలో కొత్త మార్గదర్శకత్వాన్ని పొందింది. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగంగా ప్రధానంగా శ్రామిక మహిళావుద్యమ నిర్మాణంపై లెనిన్ ప్రత్యేక కేంద్రీకరణ చేశాడు. అదే కొమింటర్న్ మూడవ సమావేశం సందర్బంగా ప్రత్యేకంగా చేపట్టిన ప్రయత్నం, ప్రయోగం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 33 దేశాల కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు మాస్కోలో 1919 మార్చి నెలలో సమావేశమై కొమింటర్న్ స్థాపించాయి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కి సంక్షిప్త నామం కొమింటర్న్!

ఆధునిక ప్రపంచంలో ఫాసిజం మొట్టమొదట ఇటలీలో పుట్టింది. అది ప్రబల ఆర్ధిక, రాజకీయ శక్తిగా ఎదిగే నేపథ్యంలో ఇటలీ సోషలిస్టు పార్టీ కేంద్ర కమిటీకి కొమింటర్న్ కార్యవర్గం 27-8-1920 తేదీన లేఖ రాసింది. ఆ లేఖ మీద కొమింటర్న్ కార్యవర్గం తరపున లెనిన్, జినోవీవ్, బుఖారిన్ సంతకాలు చేశారు. అది ఇటలీ బూర్జువా వర్గ పాలనను కూలద్రోయడానికి తగిన అనుకూల భౌతిక రాజకీయ పరిస్థితి వున్నా, ఇటలీ సోషలిస్టు పార్టీ మీనమేషాలను లెక్కించే సమయంలో రాసిన లేఖ! వెంటనే తగు విప్లవ కార్యాచరణ చేపట్టాలని స్పష్టంగా కొమింటర్న్ సూచన చేసింది. ఆ సూచనను ఇటలీ సోషలిస్టు పార్టీ పాటించలేదు. స్పష్టంగా రాజకీయ దిశా నిర్దేశం చేసినా సాయుధ విప్లవ కార్యాచరణకు దిగలేదు. అదే ఒక అవకాశంగా బూర్జువావర్గం ఫాసిస్టు శక్తుల్ని తెర పైకి తెచ్చి ప్రోత్సహించాయి. ఆ కారణంగా 1920 చివర ఇటలీలో ఫాసిజం ఒక ప్రమాదకర రాజకీయ శక్తిగా తలెత్తింది.

1921 ప్రారంభంలో ఇటలీ రాజకీయ ఆకాశాన్ని ఫాసిస్టు కారుమేఘాలు కమ్ముకున్నాయి. సరిగ్గా ఆ ప్రమాదకర కాలంలో 1921 జూన్ 22 నుండి మాస్కోలో కొమింటర్న్ మూడవ సమావేశం జరిగింది. ఆ సందర్బంగా ఆ సమావేశం పక్కనే విడిగా ప్రపంచ మహిళా ఉద్యమ ప్రతినిధుల సమావేశం క్లారా జట్కన్ నేత్రుత్వంలో జరిగింది. దానికి లెనిన్ స్వయంగా హాజరై రాజకీయ దిశా నిర్దేశం చేశాడు. ఫాసిస్టు ప్రమాదం పెరిగే కాలంలో శ్రామిక మహిళా ఉద్యమ లక్ష్యాలు, విధానాలు, చేపట్టాల్సిన కర్తవ్యాలు, అనుసరించాల్సిన కార్యాచరణ పద్ధతులు వగైరా గూర్చి ప్రత్యేకంగా చర్చించింది. అవి నేటికీ మార్గదర్శకమే. ఫాసిస్టు ప్రమాదం తిరిగి నూరేళ్ళ తర్వాత పెరిగే కాలంలో అంతర్జాతీయ మహిళా దినం సందర్బంగా నాటి లెనిన్ చేసిన రాజకీయ దిశా నిర్దేశం ఆదర్శమే కాక అనుసరణీయమే. గుర్తు చేసుకొని విప్లవ దీక్ష వహిద్దాం.
– ప్రసాద్ (పిపి) 8-3-2026

Latest News