Teertham | మనందరం దేవాలయాలకు వెళ్లినప్పుడు ఒక చిన్న పాత్రలో నీటిని ఇస్తారు. దానిని మనం తీర్థం లేదా చరణామృతం అని పిలుస్తాం. భక్తితో చేతిలో తీసుకుని తాగుతాం. కొంతమంది తలకు కూడా రాసుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించారా? ఆ తీర్థంలో ఎందుకు ఎప్పుడూ తులసి ఆకులు ఉంటాయి? ఎందుకు అందులో పచ్చ కర్పూరం కలుపుతారు? ఎందుకు చాలా దేవాలయాల్లో దీన్ని రాగి పాత్రలో ఉంచుతారు? ఇది కేవలం సంప్రదాయమా? లేక మన పూర్వీకులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఒక అద్భుతమైన విధానమా? ఈ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
తులసి – ఔషధ గుణాలున్న పవిత్ర మొక్క. భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. శాస్త్రీయంగా దీన్ని ఓసిమమ్ టెన్యూఫ్లోరం అని పిలుస్తారు. ఆయుర్వేదంలో తులసిని ఔషధ గుణాలు కలిగిన మొక్కగా పేర్కొన్నారు. తులసిలో ఉండే కొన్ని సహజ రసాయనాలు శరీరానికి ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. తులసిలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆయుర్వేదం ప్రకారం తులసి: జలుబు.. దగ్గు.. కఫ… వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం ఇవ్వగలదని భావిస్తారు. అందుకే పూర్వ కాలంలో దేవాలయ తీర్థంలో తులసి ఆకులు వేయడం ఒక సాధారణ పద్ధతిగా మారింది.
ఇక కర్పూరం విషయానికి వస్తే… మనకు తెలిసిన కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది. హారతికి ఉపయోగించే కర్పూరం ఒకటి. తినదగిన పచ్చ కర్పూరం మరోటి. ఈ పచ్చ కర్పూరాన్ని శాస్త్రీయంగా కాంఫెర్ అంటారు. ఆయుర్వేదంలో దీన్ని చిన్న పరిమాణంలో కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తుంటారు. పచ్చ కర్పూరం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా, దీని సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెండవది…. ఇది జీర్ణక్రియను ప్రేరేపించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. మూడవది, గొంతులో ఉండే గరుకుదనం తగ్గించడంలో కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. అందుకే తీర్థంలో చాలా స్వల్ప పరిమాణంలో పచ్చ కర్పూరాన్ని కలపడం ఒక సంప్రదాయంగా మారింది.
చాలా దేవాలయాల్లో తీర్థాన్ని రాగి పాత్రలో ఉంచుతారు. శాస్త్రీయంగా రాగిని Copper అంటారు. పరిశోధనల ప్రకారం రాగికి సహజమైన యాంటిమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. అంటే రాగి ఉపరితలంపై కొన్ని రకాల బ్యాక్టీరియా ఎక్కువసేపు జీవించలేవు. అందుకే పూర్వ కాలంలో నీరు నిల్వ చేయడానికి, తాగునీటిని శుభ్రంగా ఉంచడానికి రాగి పాత్రలను ఉపయోగించేవారు. రాగిపాత్రలో కొన్ని గంటలపాటు నీటిని నిల్వ చేస్తే.. ఆ నీటిలోకి సూక్ష పరిమాణంలో కాపర్ అయాన్లు కలుస్తాయి. ఇవి నీటిని కొంతమేరకు శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయట.
తులసి + రాగి – ఒక సహజ కలయిక.
పూర్వ కాలంలో వైద్య సదుపాయాలు ఎక్కువగా లేని రోజుల్లో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పద్ధతులను ఉపయోగించేవారు. తులసి ఆకులు, రాగి పాత్రలోని నీరు.. ఈ రెండింటి కలయిక ఒక సాధారణ ఆరోగ్య పద్ధతిగా ఉపయోగంలో ఉండి ఉండవచ్చని కొన్ని పరిశోధకులు భావిస్తున్నారు.
తీర్థం తాగిన తర్వాత తలకు రాసుకోవచ్చా?
చాలామంది తీర్థం తాగిన తర్వాత చేతిలో మిగిలిన నీటిని తలకు రాసుకుంటారు. ఇది భక్తి భావంతో చేసే ఒక సంప్రదాయం. అయితే కొంతమంది పండితులు ఒక విషయం చెబుతారు. తీర్థం ప్రధానంగా పానీయంగా తీసుకోవడం కోసం ఇచ్చే ప్రసాదం. కాబట్టి తాగడం ప్రధాన ఉద్దేశం. అయితే తలకు రాసుకోవడం గురించి ప్రత్యేకమైన శాస్త్రీయ నియమం ఉందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇది భక్తి సంప్రదాయం ఆధారంగా మారుతూ ఉంటుంది. మన భారతీయ సంప్రదాయాల్లో చాలా ఆచారాలు ఉన్నాయి. పైకి అవి కేవలం ఆచారాలుగా కనిపించినా… ఆరోగ్యం, పరిశుభ్రత, సహజ వైద్య పద్ధతులతో కూడా వాటికి సంబంధం ఉందని భావిస్తున్నారు.
