తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం పునఃప్రతిష్ట

తిరుమల అలిపిరి నడక మార్గంలో చోరీకి గురైన ఆంజనేయస్వామి చిన్న విగ్రహాన్ని పోలీసులు 14 గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ట నిర్వహించారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jul 23, 2026, 2:00 pm IST
Read Time: 3 mins
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం పునఃప్రతిష్ట

తిరుమల అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద చోరీకి గురైన చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యావచనం, జల సంప్రోక్షణ చేసి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీటీడీ సంప్రదాయాల ప్రకారం హనుమంతుడి విగ్రహానికి పుణ్యాహవచనం చేశాం. ఆలయం చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న విగ్రహాలకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతాం. అవాంఛనీయ ఘటనలు జరిగినా పట్టుకునే వ్యవస్థ టీటీడీ వద్ద ఉంది అని వెంకయ్య చౌదరి తెలిపారు.

14గంటల్లోనే నిందితుడి పట్టివేత

తిరుమల ఘాట్‌రోడ్‌లోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం పెద్ద విగ్రహం కింద పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహాన్ని జశ్వంత్‌ కుమార్‌ అనే వ్యక్తి అపహరించాడు. గోవిందమాల ధరించి ఘాట్‌రోడ్డుపై నుంచి ఆలయం వద్దకు వచ్చి.. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు విగ్రహాన్ని తీసుకుని వస్త్రంలో చుట్టుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పలు బృందాలుగా రంగంలోకి దిగారు. ఒంగోలు స్టేషన్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, విజిలెన్స్‌ సమన్వయంతో 14 గంటల్లో నిందితుడిని పట్టుకోవడంతో హనుమాన్ భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.