విధాత : అంతర్జాతీయ ఉమెన్స్ డే రోజు భారత మహిళ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పెర్త్ వేదికగా టీమ్‌ఇండియా వుమెన్స్ క్రికెట్ జట్టుతో జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా ముందు విజయం కోసం 25పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే పెట్టగలిగింది.రెండో ఇన్నింగ్స్‌లో ప్రతీకా రావల్ (63) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆసీస్ ఒపెనర్లు 4.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా ఆ లక్ష్యాన్ని చేధించి విజయపతాకం ఎగరేశారు. జార్జియా (16; 13 బంతుల్లో, 4 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ (11; 14 బంతుల్లో, 1 ఫోర్) నాటౌట్‌గా నిలిచారు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 198 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 323 పరుగులు చేసింది. ఆదివారం 105/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా 149 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీకా రావల్ (63; 137 బంతుల్లో, 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. స్నేహ్ రాణా (30; 54 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.
రెండో ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన (2), షెఫాలీ వర్మ (5), జెమీ రోడ్రిగ్స్ (14), హర్మన్‌ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (0), కాశ్వీ గౌతమ్ (0) సహా అందరూ విఫలమయ్యారు. క్రాంతి గౌడ్ (0) నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హామిల్టన్ 3, అన్నాబెల్, అలానా కింగ్, గార్డ్‌నర్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఒక వికెట్ తీసుకున్నారు.
