WPL-2026 | రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరుదే కప్​ : నాలుగోసారీ ఢిల్లీకి నిరాశే!

వడోదరలో జరిగిన WPL 2026 ఫైనల్‌లో ఢిల్లీపై చివరి ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించిన RCB మహిళల జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. స్మృతి మందానా అద్భుత ఇన్నింగ్స్, జార్జియా వోల్​ సహకారం, రాధా యాదవ్ సాహసంతో మరోసారి కప్​ను ముద్దాడింది.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 06, 2026 12:30 AM IST
WPL-2026 | రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరుదే కప్​ : నాలుగోసారీ ఢిల్లీకి నిరాశే!

RCB Women Clinch Second WPL Title with Thrilling Last-Over Win Over DC

డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ సారాంశం
వడోదరలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో ఢిల్లీపై 6 వికెట్లతో గెలిచిన బెంగళూరు మహిళల జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. స్మృతి మందానా 87 పరుగుల కెప్టెన్​ ఇన్నింగ్స్​తో మెరవగా, జార్జియా వోల్​ నిలకడ, చివరి ఓవర్లో రాధా యాదవ్ సాహసంతో రాయల్​ చాలెంజర్స్​ను విజ‌య‌ల‌క్ష్మి వ‌రించింది.
  • రెండోసారి టైటిల్​ గెల్చిన రాయల్​ చాలెంజర్స్​
  • విజయం ముంగిట మరోసారి బోర్లాపడ్డ ఢిల్లీ
  • నాలుగు సీజన్లలో చెరో రెండుసార్లు టైటిల్​ సాధించిన ముంబై, బెంగళూరు

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

RCB won WPL 2026 | వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల నరాలు తెంపేసింది. చివరి ఓవర్​ వరకూ సాగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి ట్రోఫీని అందుకుంది.

ఇరవై ఓవర్లలో ఢిల్లీ చేసిన 204 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.4 ఓవర్లలోనే ఛేదించి, మరోసారి తమ సత్తాను నిరూపించింది.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయానికి పునాది వేసిన స్మృతి

బెంగళూరు విజయంలో కెప్టెన్ స్మృతి మందానా పాత్ర అత్యంత కీలకపాత్ర పోషించింది. ఆమె 41 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. పన్నెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి, మానసికంగా వారిని దెబ్బతీసింది. ఆరంభంలో జార్జియా వోల్‌తో కలిసి మందానా స్కోరును వేగంగా పెంచింది. పవర్‌ప్లేలోనే ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించడంతో మ్యాచ్ బెంగళూరు వైపు మళ్లింది. అన్ని దశల్లోనూ మందానా అదే దూకుడు కొనసాగించడంతో అవసరమైన పరుగులు అదుపులోనే నిలిచాయి.

పద్దెనిమిదవ ఓవర్లో మందానా ఔటవ్వడంతో కొద్దిసేపు ఒత్తిడి పెరిగినా, అప్పటికే దాదాపుగా విజయం ఖరారైంది. జార్జియా వోల్​లో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన స్మృతి కెప్టెన్​ ఎలా ఆడాలో నిరూపించింది.

బెంగళూరు నుండి ఢిల్లీకి – చివరి ఓవర్​కు మళ్లీ బెంగళూరుకు

పదహారవ ఓవర్ తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లినట్టు కనిపించింది. జార్జియా వోల్ ఔటవ్వడంతో ఢిల్లీ ఆశలు చిగురించాయి. ఆ వెంటనే రిచా ఘోష్ కూడా వెనుదిరగడంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. ఆ దశలో ఢిల్లీ బౌలర్లు కచ్చితమైన లైన్లో బంతులు వేస్తూ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. పద్దెనిమిదవ ఓవర్లో మందానా ఔటవ్వడం మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చింది. అయితే అదే సమయంలో ఒక కీలక క్యాచ్ వదిలేయడం ఢిల్లీ కొంపముంచింది. అది క్యాచ్​ కాదు, కప్​. చివరి ఓవర్లో ఆరు బంతుల్లో పది పరుగులు అవసరమైన వేళ, బ్యాటింగ్‌కు వచ్చిన రాధా యాదవ్ అసాధారణ ధైర్యం ప్రదర్శించింది. పందొమ్మిదవ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది విజయాన్ని ఖరారు చేసింది. అయితే బంతిని బాదిన సమయంలో స్టంప్స్ కదిలినా, అది హిట్ వికెట్ కాదని అంపైర్లు నిర్ధారించడంతో బెంగళూరు శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయంతో బెంగళూరు జట్టు, మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరోసారి తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో విజేతల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

సీజన్ విజేత జట్టు రన్నరప్ జట్టు
2023 ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్
2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్
2025 ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్
2026 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ జట్టు మరోసారి ఫైనల్‌లో తడబడింది. చివరి వరకు పోరాడినా, కీలక సమయాల్లో చేసిన చిన్న తప్పిదాలు వారికి నాలుగో ఫైనల్​ ఓటమిని మిగిల్చాయి.