ఈనెల 16న తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం : 20న బడ్జెట్​

రాత్రి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ సభల సమావేశాల తేదీల ఖరారు, రాష్ట్ర బడ్జెట్, హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వంటి ప్రధాన అంశాలపై చర్చ జరిగింది

Telangana ministers addressing media after cabinet meeting – announcement of key policy decisions and welfare schemes

విధాత, హైదరాబాద్, 23 ఫిబ్రవరి 2026 :  తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు మార్చి 16వ తేదీన రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. మార్చి 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం రాత్రి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ సభల సమావేశాల తేదీల ఖరారు, రాష్ట్ర బడ్జెట్, హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వంటి ప్రధాన అంశాలపై చర్చ జరిగింది.

రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభించబోతోంది.

ప్రభుత్వోద్యోగులకు ప్రమాద బీమా పథకం : సింగరేణి, ట్రాన్స్​కోలలో కూడా..

మొదటిది.. ఉద్యోగుల ప్రమాద బీమా పధకం(Personal Accident Insurance Policy). దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికి, పెన్షనర్లకు ప్రమాద బీమా పధకం అమలు చేస్తుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలు చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రమాద బీమా అమలుతో ఒకవేళ ఎవరైనా ప్రమాదం లో మరణిస్తే రూ.1.2 కోట్లు ప్రమాద బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.

 నగదురహిత చికిత్స(EHS) పథకం(Cash-less Treatment)

ప్రభుత్వ ఉద్యోగులకు రెండో శుభవార్త ఏంటంటే క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా కింద చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేస్తారు.

వైద్య విధాన పరిషత్​ ఇక డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని‌ నిర్ణయించింది. దీంతో డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయి. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో నియమించి వారి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఆసుపత్రుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు హాస్పిటళ్లలో వైద్య సేవలను, పరిపాలనా సేవలను వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ కు వరాలు

హెచ్ఎండిఎ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(CRMP) చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేస్ 1 లో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను ఫేస్ 2లో అభివృద్ధి, నిర్వహణ అమలు చేస్తారు. రూ. 3145 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్-1, ఫేస్-2 ఆధునీకరణ ప్రాజెక్ట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జల మండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్ల తో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్​ మెట్రో రైల్​ (HMR) స్వాధీనం

హైదరాబాద్ లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం, సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఉప సంఘం ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్లో చేపట్టే ఫేజ్-2 విస్తరణకు మొత్తం మెట్రో నెట్‌వర్క్ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లను ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్-1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఉపసంఘం తమ నివేదికను సమావేశం ముందుంచింది. ప్రస్తుతం మెట్రో ఆస్తుల విలువ దాదాపు రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. దాదాపు 22 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వ మెట్రో ఫేజ్-1 ను సొంతం చేసుకుంటుంది. ఫేజ్-IIఏ లో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్-IIబీ లో 3 కారిడార్లలో 86.1 కి.మీ.ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది.

రక్షణ శాఖకు ఇవ్వాల్సిన భూముల ఎంపిక

హైద‌రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన 42 ఎక‌రాలను ర‌క్ష‌ణ శాఖ నుంచి తీసుకున్నందున స‌మాన విలువైన భూముల కింద ర‌క్ష‌ణ శాఖ‌కు కాప్రా మండ‌లంలో 153 ఎక‌రాలు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఏ ప‌రిధిలోని నియోపోలీస్ ప‌రిస‌ర ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నకు గండిపేట మండ‌లం కోకాపేట‌లో శార‌ద పీఠానికి చెందిన స్థ‌లాన్ని హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ స‌ప్ల‌య్ అండ్ సీవ‌రేజీ బోర్డుకు కేటాయించ‌డంతో పాటు శార‌ద పీఠానికి ప్ర‌త్యామ్నాయ స్థ‌లం కేటాయింపున‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిర్మించిన దుకాణాలను వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది.

కోహెడ‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌

రంగారెడ్డి జిల్లా కోహెడ‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన 223.09 ఎక‌రాల భూమిని టీజీఐఐసీ కి బ‌ద‌లాయించాలని నిర్ణయం తీసుకుంది. టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 239 ఎకరాలను ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు వ్య‌వ‌సాయ మార్కెటింగ్ విభాగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌హ‌బూబాబాద్ మండ‌లం గుమ్మ‌డూరులో జేఎన్టీయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎక‌రాలు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండ‌లం ఉమ్మాపూర్‌లో 36 ఎక‌రాలను కేటాయించింది.

11జిల్లాల్లో.. 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్లు

న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సూర్యాపేట‌, వికారాబాద్‌, మెద‌క్‌, నిజామాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది. భ‌ద్రాచ‌లంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎక‌రాల భూమిని రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖ‌మ్మం అర్బ‌న్ మండ‌లం ధంస‌లాపురం గ్రామంలో 20 ఎక‌రాలు కేటాయించింది. క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామి ఆల‌యం నిర్మాణానికి 3 ఎక‌రాల 12 గుంట‌లను దేవాదాయ శాఖ‌కు కేటాయించింది.

మే 11న జనగణనకు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన- 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌజ్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లో చేపడుతారు.

Latest News