Education Budget | మార్చి 20వ తేదీన ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఎం తైనా ఉందని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యారంగంలో నిధుల కొరత కారణంగానే పాఠశాలల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. సమస్యలన్నింటికీ నిధుల కొరతే ప్రధాన కారణం అని అనేక సర్వేల్లో తేలింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అన్నారు. కానీ విద్యారంగానికి కేటాయించే నిధుల(బడ్జెట్) విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉందనే విషయం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న కేటాయింపులు చూస్తే తెలుస్తుంది.
భారత దేశంలోనే వెనుకబడిన రాష్ట్రాలను ఆర్థికవేత్తలు బీమారు రాష్ట్రాలుగా పిలుస్తున్న ఉత్తరప్రదేశ్ 13 శాతం, రాజస్థాన్ 18 శాతం, మధ్యప్రదేశ్ 16 శాతం, బీహార్ 18.4 శాతం విద్యారంగానికి తమ తమ రాష్ట్రాల బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నవి. తెలంగాణ మాత్రం 7.57 శాతం నిధులే కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ నిధులు కేటాయించడం లేదు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూసినా తమిళనాడు 13.4 శాతం, కేరళ 14.8 శాతం, కర్ణాటక 12.9 శాతం, చివరికి మనతో విడిపోయిన ప్రక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా 12 శాతం పైగా విద్యారంగానికి నిధులు కేటాయిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మొదటి సంవత్సరం 2014–15 బడ్జెట్లో విద్యకు కేటాయింపులు 10.89 శాతం ఉండగా బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చివరి సంవత్సరం (2023- 24) నాటికి అది 6.5 శాతానికి పడిపోయింది. గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని గాడిలో పెడతామని, విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం 2024-25 లో 7.3 శాతం, రెండవ సంవత్సరం 2025-26 లో 7.57 శాతం మాత్రమే కేటాయించారు. ఈ సారైనా మార్చి 20 న ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20 శాతానికి తగ్గకుండా నిధులు కేటాయించాలని కోరుతున్నాము.
బడ్జెట్ లోటుతో రాష్ట్ర విద్యారంగం 12 ఏళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వచ్చే విద్యా సంవత్సరంలోపు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరు గైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించుటకు చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నది.
విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ ఉండడం వల్లనే అవసరమైనన్ని గదులు లేని పాఠశాలలు 13,574 వరకు ఉండగా ఒక్కటే టాయిలెట్ ఉన్న పాఠశాలలు 21,507 ఉన్నాయి. పక్కా కాంపౌండ్ వాల్ లేనివి 13,868 ఉండగా, కంప్యూటర్ ల్యాబ్ లు లేనివి 22,047 పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 20 వేల స్కూళ్ళలో సగటున ఇద్దరే ఉపాధ్యాయులన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. వేలాది పాఠశాలల్లో సైన్స్ టీచర్లు లేరు. లెక్కల టీచర్లు లేరు. భాషా పండితులు లేరు. అంతే కాదు జిల్లాల్లో పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు లేరు. సరైన మానిటరింగ్ వ్యవస్థలేని కారణంగా, మౌలిక వసతుల లేమి కారణంగా గత రెండు సంవత్సరాలలో 4000 వరకు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా పాఠశాలలు రేషనలైజేషన్ చేసి మూసివేస్తామని ప్రకటించలేదు.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో మూతబడిన బడులను తిరిగి తెరుస్తామని పదే పదే అనేక సమావేశాల్లో ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూతబడిన పాఠశాలలే వారి నిబద్ధతకు నిదర్శనంగానిలుస్తున్నవి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలకు పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖ అధికారులు(డిఇఓ) లేరు. ఇంచార్జీ డిఇఓ లు, ఇంచార్జీ ఎంఇఓ లతో రాష్ట్రంలో మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలి పోయింది. విద్యారంగానికి సంబంధం లేని అధికారుల(కలెక్టర్లకు)కు డిఇఓ లుగా అదనపు(ఎఫ్ఏసి) బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఇది హేతువిరుద్ధమైనది. జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లను పర్యవేక్షణ చేయవలసిన జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారిని ఒక విద్యా విభాగానికి అధిపతిగా నియమించడం వారి స్థాయిని తగ్గించడమే అవుతుంది. సరైన పర్యవేక్షణ చేయలేని పరిస్థితి ఉంటుంది. డిప్యూటీ ఇఓ అయినా, డిఇఓ అయినా వారు తప్పనిసరిగా బిఇడి చేసి ఉండాలి. ఇది తప్పనిసరి. స్కూల్ ఎడ్యుకేషన్ తో సంబంధం లేని అధికారులకు డిఇఓ బాధ్యతలు అప్పగించకుండా చూడాలి.
అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు, వాచ్‌మెన్ లేరు. అనేక పాఠశాలల్లో టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి) ప్యానెల్స్ తదితర విలువైన ఎలక్ట్రానిక్ వస్తు సామాగ్రి ఉన్నాయి. వాటికి సరైన రక్షణ లేదు. రాత్రి కాపలదారులు లేరు. అనేక పాఠశాలల్లో గంట కొట్టడానికి అటెండర్ లేడు. ఒక పాఠశాల నడవాలంటే ఏమేమి ఉండాలో అవన్నీ కల్పిస్తేనే పాఠశాల సక్రమంగా నడుస్తుంది. అప్పుడే తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుంది. ఇది మా బడి, మా పిల్లల బడి అని గర్వంగా చెప్పుకునేలా ప్రతి బడిని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రి గారు పదే పదే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేస్తామని క్రీడా పాలసీని రూపొందించారు. కానీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో క్రీడా సామర్థ్యాలు పెంపొందించుటకు తగు శిక్షణ ఇచ్చే క్రీడా ఉపాధ్యాయులు లేరు. కావున ప్రాథమిక స్థాయి పాఠశాలలకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పిఇటి) పోస్టు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకంటే రెండు సంవత్సరాల తర్వాత స్వాతంత్ర్యం పొందిన చైనా క్రీడా రంగంలో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉందన్న విషయం గమనించాలి. అక్కడి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండే క్రీడా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే ఇది సాధ్యమైంది. కనుక ముఖ్యమంత్రి గారిని ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా పిఇటిని నియమించేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతున్నది.
పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకతను గుర్తించి, అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో పూర్వ ప్రాథమిక విద్య లేనికరణంగాననే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయివేట్ పాఠశాలల్లో ఎల్ కేజీ, యుకేజీ లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సౌకర్యము లేదు. ప్రభుత్వ యాజమాన్యంలో ఎన్రోల్మెంట్ తగ్గుదలకు ఇదొక కారణంగా ఉంది. తప్పనిసరిగా ప్రాథమిక విద్యను బలోపేతం చేయుటకు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, అందుకు తగిన ఉపాధ్యాయులను,వసతులను సౌకర్యాలను కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం విశ్వాసం కల్పించే విధంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బడి ఈడు పిల్లలందరూ బడుల్లో చేరే విధంగా విద్యా ఉద్యమాన్ని ప్రారంభించాలి. ముఖ్యమంత్రి మంత్రులు ఒక విధాన నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుటకు ముందుకు వస్తారు. ప్రయివేట్ బడుల్లో వేలు, లక్షల ఫీజుల భారం నుండు బయటపడతారు. ప్రభుత్వం చేయాల్సింది బడుల్లో మౌళిక వసతులు కల్పించి, పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. బడుల్లో ప్రయోగశాలలు పనిచేసేలా చూడాలి. విద్యార్థులకు త్రాగునీరు మరియు టాయిలెట్స్ సక్రమమైన నిర్వహణకు రన్నింగ్ వాటర్ ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం(మిడ్డే మీల్) లో నాణ్యత పెంచాలి.
విద్యాశాఖను ముఖ్యమంత్రే స్వయంగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక దృష్టి పెట్టీ తెలంగాణలో విద్యారంగాన్ని దేశంలోనే ఉన్నతమైన స్థానంలో(తెలంగాణ రైజింగ్ నంబర్ 1 గా) నిలిపేందుకు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కనీసం 20 శాతం తగ్గకుండా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నది.
– ఇంజమూరి రఘునందన్,
బాలల హక్కుల సంక్షేమ సంఘం (బీహెచ్ఎస్ఎస్)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్: 9866102962
