మోదీ పాచికలు పారనివ్వని బెంగాల్‌.. అధికారం మళ్లీ తృణమూల్‌దే: పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

బెంగాల్‌ ప్రజలు మరోసారి టీఎంసీని ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

బెంగాల్‌లో బీజేపీని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌.. తగినంత మెజార్టీతో మరోసారి అధికారం చేపట్టబోతున్నదని వెల్లడిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 సీట్లు ఉన్నాయి. టీఎంసీకి 46.5 శాతం ఓట్లు రావచ్చిన అంచనా వేసిన సర్వే.. దాని ప్రకారం.. 177 నుంచి 187 సీట్లు రావచ్చని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 41.5 శాతం ఓట్లతో 95 నుంచి 110 సీట్ల మధ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 2.1 శాతం ఓట్లతో ఒకటి – మూడు స్థానాల మధ్య గెలుపొందుతుందని పేర్కొంది. వామపక్షాలు 4.1 శాతం ఓటింగ్‌తో గరిష్ఠంగా ఒక సీటు పొందే అవకాశం ఉందని తెలిపింది

భారతీయ గూర్ఖా ప్రజాతంత్రిక్‌ మోర్చా ఒకటి నుంచి రెండు సీట్లు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్ పోల్స్‌ పేర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరాశ కలిగినా.. బెంగాల్‌లోని అన్ని రీజియన్లలో టీఎంసీ తన పట్టును నిలుపుకొన్నదని ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను బట్టి తెలుస్తున్నది. బీజేపీ తన ఓటు బ్యాంకును నిలుపుకోగా.. కొన్ని చోట్ల మాత్రం కొంత ఓటింగ్‌ పెంచుకోగలిగినా.. అవి సీట్ల రూపంలోకి మళ్లలేదని అంచనా వేసింది.

ఉత్తర బెంగాల్‌లో పోటాపోటీ

ఉత్తర బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగిందని ఎగ్జిట్ పోల్‌ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ఎస్టీలు, ఎస్సీలు, గూర్ఖా ఓటర్లలో బీజేపీ తన ప్రభావాన్ని కొనసాగించగా.. కూచ్‌బిహార్‌ వంటి నియోజకవర్గాల్లో టీఎంసీ భారీ విజయాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి తెలుస్తున్నది. షెడ్యూల్డ్‌ కులాలు, ఓబీసీలు రెండు పార్టీల మధ్య చీలిపోయినప్పటికీ.. మహిళా ఓటర్లు మాత్రం టీఎంసీకి గట్టి వెన్నుదన్నుగా నిలిచారని తెలుస్తున్నది. అందుకు మమతా బెనర్జీ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలే కారణమని చెబుతున్నారు,

Latest News