Transgenders | ట్రాన్స్‌జెండర్లు శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడిగే హక్కు లేదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడానికి ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే బీఎన్‌ఎస్ కింద నేరంగా పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Transgenders | ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ట్రాన్స్‌జెండర్లు వచ్చి దీవెనలు ఇస్తారు.. అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటారు. దీన్నే బధాయి ( Badhai) లేదా నేగ్ (Neg) అని పిలుస్తుంటారు. అయితే ఇలా శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడానికి ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే బీఎన్‌ఎస్ కింద నేరంగా పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సంప్రదాయం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని చట్టం అంగీకరించబోదని జస్టిస్ అలోక్ మాథూర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన లక్నో బెంచ్ తేల్చిచెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన రేఖా దేవి అనే ట్రాన్స్‌జెండర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జర్వాల్ పట్టణంలోని కటికాపూల్ నుంచి ఘాఘ్రా ఘాట్, అక్కడి నుంచి కర్నల్‌గంజ్‌లోని సరయూ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని తనకు ప్రత్యేకంగా నేగ్ వసూలు చేసుకునే జోన్‌గా గుర్తించాలని గోండా జిల్లాకు చెందిన రేఖా దేవి అనే ట్రాన్స్‌జెండర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తాను చాలా ఏళ్లుగా అక్కడ బధాయి వసూలు చేస్తున్నానని.. అదే ప్రాంతంలోకి ఇప్పుడు ఇతర ఏరియా ట్రాన్స్‌జెండర్లు రావడంతో ఘర్షణలు జరుగుతున్నాయని.. అందుకే తమకు ప్రత్యేక జోన్లు కేటాయించాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అలోక్ మాథూర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఏదైనా పన్ను లేదా రుసుమును కేవలం చట్టం కల్పించిన అధికారం ద్వారానే వసూలు చేయాలని తెలిపింది. బధాయి లేదా నేగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడానికి ఎలాంటి చట్టపరమైన అనుమతి లేదని స్పష్టం చేసింది.

ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవచ్చని, ఒత్తిడి చేసి బలవంతంగా డబ్బులు చెల్లించేలా ఆదేశించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి వసూళ్లు దోపిడీ కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ – 2019లో కూడా ఇలాంటి హక్కు ఎక్కడా ప్రస్తావించలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే అక్రమ వసూళ్లకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందని అభిప్రాయపడింది. తద్వారా నేరపూరిత కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది.

Read More:

Cooking Gas Shortage | ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్ నింపుకుంటున్న పాక్ ప్రజలు.. మొబైల్ బాంబ్‌గా మారిపోతున్న ఇళ్లు

ఒకే స్కూటర్‌పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!

Latest News