Allahabad high court | సమస్య తెచ్చుకున్నందుకు ఆమె కూడా బాధ్యురాలే.. రేప్‌ కేసులో అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు

వక్షోజాలను పట్టుకోవడం, పైజామా బొందు తెంపేయడం లైంగిక దాడికి ప్రయత్నం కిందకు రాదని ఇటీవల ఇదే అలహాబాద్‌ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కేసులో చర్చనీయాంశమైన తీర్పును అలహాబాద్‌ హైకోర్టు వెలువరించింది.

  • By: TAAZ    crime    Apr 10, 2025 10:08 PM IST
Allahabad high court | సమస్య తెచ్చుకున్నందుకు ఆమె కూడా బాధ్యురాలే.. రేప్‌ కేసులో అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు

Allahabad high court |  బాధితురాలు తనంతట తానే సమస్యను కొని తెచ్చుకున్నారంటూ ఒక రేప్‌ కేసులో నిందితుడికి అలహాబాద్‌ హైకోర్ట్‌ జడ్జి ఇటీవల బెయిల్‌ మంజూరు చేశారు. ‘అమే సమస్యను తెచ్చుకున్నది. అందుకు ఆమె కూడా బాధ్యురాలే’ అని పేర్కొన్నారు. వక్షోజాలను పట్టుకోవడం, పైజామా బొందు తెంపేయడం లైంగిక దాడికి ప్రయత్నం కిందకు రాదని ఇటీవల ఇదే అలహాబాద్‌ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కేసులో చర్చనీయాంశమైన తీర్పును అలహాబాద్‌ హైకోర్టు వెలువరించింది. గత ఏడాది గౌతమ్‌ బుద్ధ నగర్‌లో రిజిస్టరయిన రేప్‌ కేసులో నిందితుడు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏక సభ్య ధర్మాసనంలోని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ పై వ్యాఖ్యలు చేశారు. కేసు పెట్టిన యువతి మేజర్‌ అని, పీజీ హాస్టల్‌లో నివసిస్తున్నదని నిందితుడు చెబుతున్నాడు.

‘తన స్నేహితుళ్లతోపాటు కొందరు పురుష స్నేహితులతో ఆమె రికార్డ్‌రూమ్‌ బార్‌ రెస్టారెంట్‌కు వెళ్లడం ద్వారా ఆమె తనంతట తానుగా సమస్యను కొనితెచ్చుకున్నది. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. దాంతో ఆమె మైకంలోకి వెళ్లిపోయింది’ అని కోర్టు పేర్కొన్నది. ఆమె, ఆమె స్నేహితులు అంతా 3 గంటల దాకా బార్‌లోనే గడిపారు. ఓపికలేకపోవడంతో ఆమె తనంతట తానుగా నిందితుడి ఇంటికి వెళ్లి రెస్ట్‌ తీసుకునేందుకు ఒప్పుకొన్నది. ‘ తనను అతడి ఇంటికి కాకుండా వేరే బంధువు ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ తనను రెండుసార్లు రేప్‌ చేశాడని బాధితురాలు చెబుతున్నది  అయితే.. అది అసత్యమని, సాక్ష్యాధారాలకు వ్యతిరేకమని అర్థమవుతున్నది’ అని కోర్టు తెలిపింది. బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో చెప్పిన వివరాల ప్రకారమే ఇది రేప్‌ కాదని, ఇష్టపూర్వకంగానే ఇద్దరూ శారీరకంగా కలిశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇద్దరూ మేజర్లేనని, బాధితురాలు ఎంఏ చదువుతున్నదని, తన చర్యల నైతికత, దాని పర్యవసానాల గురించి అర్థం చేసుకోగల స్థాయి కలిగిన వ్యక్తి అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి ఆరోపణను వాస్తవంగా అంగీకరించినప్పటికీ ఈ పరిస్థితికి ఆమె కూడా కారణమని నిర్ధారణకు రావాల్సి వస్తున్నదని పేర్కొన్నది. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె హైమన్‌ చిరిగినట్టు ఉన్నా.. ఆమెపై లైంగిక దాడి జరిగిందనే అభిప్రాయాన్ని డాక్టర్‌ వ్యక్తం చేయలేదని కోర్టు పేర్కొన్నది. దీంతో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.