Supreme Court | రేప్‌ల‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పుపై.. సుప్రీం స్టే! జడ్జిమెంట్‌పై తీవ్ర వ్యాఖ్యలు

అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌ద‌రు తీర్పులోని పేర్కొన్న వ్యాఖ్య‌లు ప్ర‌త్యేకించి 21, 24, 26 పేరాల్లోని మాట‌లు తీర్పు రాసిన వారిలో సున్నిత‌త్వం కొర‌వ‌డింద‌ని వెల్లడిస్తున్నాయని బాధ‌తో చెబుతున్నాం.. అని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొన్నది.

Supreme Court | రేప్‌ల‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పుపై.. సుప్రీం స్టే! జడ్జిమెంట్‌పై తీవ్ర వ్యాఖ్యలు

Supreme Court । బాలిక వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా బొందు తెంప‌డం, క‌ల్వ‌ర్టు కింద‌కు ఈడ్చుకుపోవ‌డం రేప్ ప్ర‌య‌త్నం కిందకు రాదంటూ ఒక కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్ప‌ద ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు బుధ‌వారం స్టే ఇచ్చింది. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు నిందితుల‌పై కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వ‌రిస్తూ అల‌హాబాద్ హైకోర్టు ఏక‌ స‌భ్య ధ‌ర్మాస‌నంలోని జ‌స్టిస్ రామ్ మ‌నోహ‌ర్ నారాయ‌ణ్ మిశ్రా గ‌త‌వారం వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ అంశంపై బుధ‌వారం జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ ఏజీ మ‌సీహ్‌ ధ‌ర్మాస‌నం విచారించింది. హైకోర్టు తీర్పు ప‌ట్ల తీవ్ర అస‌మ్మ‌తిని వ్య‌క్తం చేసింది. అంతేకాదు.. హైకోర్టు తీర్పును దిగ్భ్రాంతిక‌రం అని అభివ‌ర్ణించింది. అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌ద‌రు తీర్పులోని పేర్కొన్న వ్యాఖ్య‌లు ప్ర‌త్యేకించి 21, 24, 26 పేరాల్లోని మాట‌లు తీర్పు రాసిన వారిలో సున్నిత‌త్వం కొర‌వ‌డింద‌ని వెల్లడిస్తున్నాయని బాధ‌తో చెబుతున్నాం.. అని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ట్టు లైవ్‌లా తెలిపింది. అల‌హాబాద్ హైకోర్టు తీర్పు కూడా అప్ప‌టిక‌ప్పుడు ఇచ్చింది కాద‌ని, నాలుగు నెల‌లు రిజ‌ర్వ్ చేసి మ‌రీ వెల్ల‌డించిన తీర్పు అని బెంచ్ పేర్కొన్న‌ది.

“ఇది కూడా ఆ క్షణంలో ఇచ్చిన తీర్పు కాదు. నాలుగు నెలల తర్వాత రిజర్వ్ చేసిన తర్వాత ఇచ్చిన తీర్పు. అందుకే మనస్ఫూర్తిగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నాం. ఈ దశలో మేము సాధారణంగా స్టే ఇవ్వడానికి వెనుకాడుతాం. కానీ 21, 24, 26 పేరాల్లోని పరిశీలనలు చట్టానికి తెలియనివి. అమానవీయ విధానాన్ని చూపుతున్నాయి. క‌నుక‌.. పైన పేర్కొన్న పేరాల్లోని ప‌రిశీల‌న‌ల‌ను నిలిపివేస్తున్నాం.. అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ట్టు ఎన్డీటీవీ తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంతో ఏకీభవించినట్లు తెలుస్తున్న‌ది.

మార్చి 20వ తేదీన ఈ వివాదాస్ప‌ద తీర్పును అల‌హాబాద్ హైకోర్టు ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం వెలువ‌రించింది. బాధితురాలి వ‌క్షోజాల‌ను ప‌ట్టుకోవ‌డం, ఆమె పైజామా బొందును తెంపివేయ‌డం, ఆమెను క‌ల్వ‌ర్టు వ‌ద్ద‌కు ఈడ్చుకుపోవ‌డం అటుపై చుట్టుపక్కలవారు వెంటనే స్పందించడంతో పారిపోయారు. అయితే ఈ ప్రయత్నం లైంగికదాడికి ప్రయత్నంగా (అటెంప్ట్ టు రేప్‌) చూడరాదని అలహాబాద్ హైకోర్టు మార్చి 20, 2025న తీర్పు చెప్పింది. లైంగిక దౌర్జన్యంగా మాత్రమే చూడాలని పేర్కొన్నది.