హైద‌రాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వ పరం.. ఎల్అండ్‌టీతో ఒప్పందం పూర్తి

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయనున్నది. ఈ మేరకు షేర్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎల్‌అండ్‌టీకి ఒప్పందం కుదిరింది.

Hyderabad Metro takeover

విధాత, హైద‌రాబాద్‌:

ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న మెట్రో రైల్‌.. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. ఇక నుంచి మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను స్వాధీనం చేసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ‌తంలోనే నిర్ణయించింది. ఈ మేర‌కు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా సంప్రదింపులు నిర్వహించింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కే రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో ఎల్అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు బుధ‌వారం స‌చివాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా ఎల్అండ్‌టీ సంస్థలతో షేర్ల కొనుగోలు కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్‌టీకి ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్‌టీ త‌ర‌ఫున‌ డీకే సేన్‌, కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్‌టీ హామీతో మెట్రో రైలుపై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును 2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు.

మెట్రో రైలులో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. మెట్రో రైలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II నెట్‌వర్క్ రూప‌క‌ల్పన‌, ప‌నులు, ప్రణాళిక‌, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భ‌విష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధార‌ప‌డద‌గిన‌, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యమంత్రితో ఎల్అండ్‌టీ చైర్మన్ భేటీ

ఎల్అండ్‌టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్అండ్‌టీ చైర్మన్‌, ఎండీ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లుసుకున్నారు.

Read Also |

ఇకపై మంచివాడిగా ఉండను.. ఫోటోతో ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మోదీ పాచికలు పారనివ్వని బెంగాల్‌.. అధికారం మళ్లీ తృణమూల్‌దే: పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా
Ravi Babu | సినిమా మేకింగ్‌పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. అన్‌లిమిటెడ్ టైమ్‌తో ఎవడైనా సినిమా తీస్తాడంటూ కామెంట్

Latest News