తెలంగాణలోని సర్కారు బ‌డి విద్యార్థులకు గుడ్ న్యూస్!

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి విద్యార్థుల ముంగిటకే 'ఎడ్యుకేషన్ కిట్లు' అందించాలని నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి విద్యార్థుల ముంగిటకే ‘ఎడ్యుకేషన్ కిట్లు’ రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రిని అందించడం, మెరుగైన విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ‘ఎడ్యుకేషన్ కిట్లు’ పంపిణీ చేపట్టబోతుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ముందే ఈ కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి ప్రత్యేక టెండర్లు పిలిచింది. ఎంపికైన గుత్తేదారులు 45 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే జరిమానాలు విధించడంతో పాటు… నిబంధనలు ఉల్లంఘిస్తే బ్లాక్‌లిస్ట్ చేసే చర్యలు కూడా తీసుకోనుంది. ప్రతి వస్తువుకు బార్‌కోడ్ కేటాయించి పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రీ-బిడ్ సమావేశం కూడా నిర్వహించి టెండర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సొసైటీలు, స్థానిక సంస్థల పాఠశాలలు, వసతి గృహాల్లో ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న దాదాపు 9.5 లక్షల మందికి ప్రభుత్వ వాటర్‌ మార్క్‌ లోగోతో కూడిన ఎడ్యుకేషన్‌ కిట్‌లు అందనున్నాయి. డేస్కాలర్, రెసిడెన్షియల్‌ విద్యార్థుల వారీగా ప్రభుత్వం గుర్తించిన 24 వస్తువులను వారి అవసరాల మేరకు ఇవ్వనుంది. గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కిట్‌లోని ప్రతి వస్తువు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దాదాపు 42,303 మంది విద్యార్థులకు అందించాల్సిన వస్తువుల వివరాలను టెండరు ప్రకటనలో పేర్కొంది.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే డే స్కాలర్ విద్యార్థులకు కూడా ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. వారికి బ్లాక్ షూస్, రెండు జతల సాక్సులు, బెల్ట్ ఇవ్వనుంది. దీని ద్వారా మరో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది

ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు కూడా !

ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, వసతి గృహాలు, మోడల్‌స్కూల్స్, ప్రభుత్వ, స్థానిక సంస్థల, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులకు ఐడీకార్డులిస్తారు. అలాగే చిన్నపిల్లల నుంచి డిగ్రీ విద్యార్థులందరికీ స్టేషనరీకిట్లు ఇవ్వనున్నారు. స్టేషనరీ కిట్‌లో ప్లాస్టిక్‌ స్కేలు, పెన్సిల్‌ బాక్సు, ఎరేజర్లు, షార్పనర్లు, బ్లూ,రెడ్‌ పెన్నులు, స్కెచ్‌పెన్స్, పరీక్షప్యాడ్, పౌచ్‌ ఉంటాయి. చిన్నపిల్లలకే క్రేయాన్స్‌ ఉంటాయి. విద్యార్థుల తరగతుల స్థాయి ఆధారంగా స్కూల్‌బ్యాగులు సిద్ధం చేస్తున్నారు. 1-3 తరగతి వరకు 25 లీటర్లు, 4-8 తరగతి వరకు 30 లీటర్లు, 9 నుంచి డిగ్రీ వరకుచదివే విద్యార్థులకు 35 లీటర్ల పరిమాణంతో కూడిన బ్యాగులు అందుతాయి. విద్యార్థులకిచ్చే ప్లేట్, గ్లాస్, కటోరా, స్పూన్, హ్యాండిల్‌ కప్‌ ఒకసెట్‌గా సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకిచ్చే బ్లాకెంట్‌ చివరి అంచులపై ప్రభుత్వ లోగో… విద్యాసంస్థ, సొసైటీని వేగంగా గుర్తించేలా కలర్‌ స్కీమ్‌ ఉండాలని వివరించింది. మరోవైపు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థినుల కోసం డ్రెస్‌లో సర్కారు మార్పులు చేసింది.

ఇవి కూడా చదవండి :

అమెరికా–ఇరాన్​ చర్చలు విఫలం : హోర్ముజ్​ను దిగ్బంధిస్తాం – ట్రంప్​ హెచ్చరిక
ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!

Latest News