అమెరికా–ఇరాన్​ చర్చలు విఫలం : హోర్ముజ్​ను దిగ్బంధిస్తాం – ట్రంప్​ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ హోర్ముజ్ జలసంధి బ్లాకేడ్ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరా, భారత్ సహా ఇతర ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికా–ఇరాన్​ చర్చలు విఫలం : హోర్ముజ్​ను దిగ్బంధిస్తాం – ట్రంప్​ హెచ్చరిక అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం విమానంలో ఎక్కుతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

World on Edge as US Moves to Block Hormuz After Iran Talks Collapse

  • 21 గంటల అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం
  • హోర్ముజ్ జలసంధిని మూసేస్తాం :  ట్రంప్ సంచలన ప్రకటన
  • ఒక్క చిన్న ఘటన కూడా యుద్ధానికి దారి తీసే ప్రమాదం
  • పరోక్ష చర్చలతో పాకిస్థాన్​ విఫల దౌత్యం
  • 21 గంటల చర్చలు వృథాఒప్పందం లేకుండానే వెనుదిరిగిన బృందాలు

విధాత ప్రపంచం డెస్క్​ | హైదరాబాద్​:

US‌‌ – Iran Talks Collapse | అమెరికా–ఇరాన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి పరోక్ష శాంతి చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. శనివారం ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు 21 గంటల పాటు సాగినా… కీలక అంశాలపై ఇరువైపులా ఒప్పందం కుదరలేదు.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత కీలక చర్చలుగా ఇవి నిలిచాయి. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్​ నేతృత్వం వహించగా… ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్  మొహమ్మద్​ బాఘెర్ ఘలీబాఫ్​ బృందాన్ని నడిపించారు.

చర్చల అనంతరం వాన్స్ మాట్లాడుతూ, మేము మా షరతులు విస్పష్టంగా తెలియజేసాం. ఇరాన్ వాటికి అంగీకరించలేదు. ఇది వాళ్లకే పెద్ద నష్టమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్, అమెరికా డిమాండ్లు అతిగా ఉన్నాయనీ… నమ్మకం లేకపోవడం వల్లే ఒప్పందం కుదరలేదని తెలిపింది. అయితే దౌత్య మార్గం మూసేయలేదని కూడా స్పష్టం చేసింది.

ణ్వాయుధాలే కీలకం విశ్వాస లోపంతో డీల్ ఫెయిల్​

Iran, US and Pakistan leaders during high-level talks in Islamabad

ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో ఇరాన్, అమెరికా, పాకిస్థాన్ నాయకులు

ఈ చర్చలలో ప్రధానంగా అణు అంశమే అడ్డంకిగా మారింది. అమెరికా,  ఇరాన్ పూర్తిగా అణ్వాయుధాల అభివృద్ధిని వదిలేయాలనీ, సంబంధిత సామర్థ్యాలను కూడా నిర్మూలించాలని డిమాండ్ చేసింది. కానీ ఇరాన్ దీనిని తమ సార్వభౌమత్వ హక్కులపై జోక్యం అంటూ తిరస్కరించింది.

అదే సమయంలో హోర్ముజ్​ జలసంధిపై నియంత్రణ కూడా పెద్ద వివాదంగా మారింది. హోర్ముజ్​ గుండా పయనించే నౌకలపై ఇరాన్​ టోల్ విధించాలనే ఆలోచనలో ఉండగా… అమెరికా ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా రవాణా ఉండాలని పట్టుబట్టింది. దీన్ని కూడా ఇరాన్​ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

ఈ భేదాభిప్రాయాలన్నింటికంటే పెద్ద సమస్య — ఇరువైపులా నమ్మకం లేకపోవడం. గత ఒప్పందాల అనుభవం కారణంగా రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో చివరికి చర్చలు ఎటూ పొసగకుండా ఆగిపోయాయి.

 ట్రంప్ షాకింగ్​ నిర్ణయం : హోర్ముజ్ మూసేస్తాం – ప్రపంచానికి హెచ్చరిక

Cargo vessel sailing in Strait of Hormuz amid rising US-Iran tensions

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న కార్గో నౌక

చర్చలు విఫలమైన వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ సంచలన ప్రకటన చేశారు. తన ‘ట్రూత్ సోషల్’లో… ఇరాన్ అణ్వాయుధాలపై వెనక్కి తగ్గడం లేనందున, అమెరికా నావికాదళం హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తుందని ప్రకటించారు.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఆధారపడే ఈ కీలక మార్గాన్ని మూసేస్తే:

  • నౌకల రాకపోకలపై కఠిన నియంత్రణ
  • ఇరాన్‌కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకోవడం
  • అంతర్జాతీయ జలాల్లో కూడా చర్యలు

వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ALSO READ: హోర్ముజ్​లోకి వస్తే మీ యుద్ధనౌకలు ఖతం : అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​

ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇప్పటికే ఆరు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

హోర్ముజ్ పరిణామాలపై ప్రపంచం మొత్తం దృష్టి సారించగా… చమురు ధరలు పెరగడం, భారత్‌తో సహా అనేక దేశాల్లో ఆర్థిక ప్రభావం కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తర్వాత ఏంటి పరిస్థితి?

US President Donald Trump reacting after announcing Hormuz blockade decision

హోర్ముజ్ బ్లాకేడ్ ప్రకటన అనంతరం స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రస్తుతం పరిస్థితి సాధారణ ఉద్రిక్తత దశను దాటి, త్యంత తీవ్ర దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా దిగ్బంధనం అమలు ప్రారంభిస్తే… జలసంధి వద్ద నౌకాదళాల మధ్య నేరుగా ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది. ఇరాన్ తన నౌకాదళం, డ్రోన్లు, సీ మైన్స్‌తో ప్రతిస్పందిస్తే… చిన్న స్థాయి ఘటనలు కూడా పెద్ద సైనిక ఘర్షణకు మారే ప్రమాదం ఉంది.

అయితే ఇదే సమయంలో అమెరికా వ్యూహం పూర్తిస్థాయి యుద్ధం వైపు కాదని, ఒత్తిడి పెంచి  మళ్లీ చర్చలకు తీసుకురావడమే లక్ష్యమని అంతర్జాతీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంటే బయటికి కఠిన చర్యలు… లోపల గోప్య చర్చలు కొనసాగించే ద్వంద్వ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒమన్, పాకిస్తాన్ వంటి దేశాలు మళ్లీ మధ్యవర్తిత్వానికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్థికంగా చూస్తే… యుద్ధం కంటే ముందే దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం, నౌకాయాన బీమా ఖర్చులు పెరగడం, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం — ఇవన్నీ తక్షణ ప్రభావాలుగా మారవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఇది మరింత భారంగా మారే ప్రమాదం ఉంది.

మొత్తం మీద చూస్తే… పరిస్థితి ఇప్పుడు యుద్ధం అంచున నిలిచినట్టే. ఒక్క తప్పుడు చర్య కూడా తీవ్ర ఘర్షణగా మారే ప్రమాదం ఉన్నప్పటికీ, ఇరు వర్గాలు పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.